Court Verdicts on Jagan Kodikatti Case: కోడికత్తి దాడి సంఘటనకు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కారణమని.. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న దినేష్‌కుమార్‌కు ఆయనే కోడికత్తి ఇచ్చారన్నారు. నేరాన్ని జనపల్లి శ్రీనుపై నెట్టారని జగన్ విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే భయంతోనే రావడం లేదన్నారు. కేసులో కుట్ర, రాజకీయ కోణమే ఉందని న్యాయవాది సలీం ఆరోపించారు.
Jagan was attacked with a knife at the Visakha airport: కోడికత్తి కేసుపై విశాఖ ఎన్ఐఏ న్యాయస్థానం విచారించాక ఆయన బయట విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల కోసమే కేసును వాయిదాలు వేస్తూ సాగదీస్తున్నారని విమర్శించారు. రావాలి జగన్.. చెప్పాలి వాదన.. ఇవ్వాలి ఎన్వోసీ అనేది తమ వాదన అని తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్‌ఐఏ చెప్పిందని వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడిపై నమోదైన కేసు విచారణ ఇన్నాళ్లు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో సాగింది. అక్కడినుంచి విశాఖకు బదిలీ చేశాక తొలిసారి విచారణ జరిగింది.
Kodikatthi case hearing adjourned to September 6: వాదనల అనంతరం విచారణ సెప్టెంబరు 6కు వాయిదా పడింది. కేసులో నిందితుడైన జనపల్లి శ్రీనివాసరావు (శ్రీను)ను రాజమహేంద్రవరం జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య మూడో అదనపు న్యాయస్థానంలో ఉదయం 10.45కు ఎన్‌ఐఏ పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటివరకు విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులను పరిశీలించి విచారణ ముందుకు తీసుకెళ్లడానికి సెప్టెంబరు 18 వరకు గడువునివ్వాలని ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధిరాములు న్యాయస్థానాన్ని కోరారు. పరిశీలనకు అంత సమయం అవసరం లేదంటూ సెప్టెంబరు 6కు న్యాయమూర్తి మురళీకృష్ణ వాయిదా వేశారు.
Arguments on bail petition of Kodikatthi accused: అదే రోజు నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినే అవకాశాలున్నాయి. విచారణ వాయిదా వేశాక శ్రీనివాసరావును విశాఖ జైలుకు పంపిస్తారని తొలుత అందరూ భావించగా, తిరిగి రాజమహేంద్రవరం కారాగారానికే తరలించారు. రాజమహేంద్రవరం, విశాఖ ఏ జైలైనా ఫర్వాలేదు.. న్యాయం జరిగితే చాలంటూ నిందితుడు శ్రీను మీడియా ఎదుట మాట్లాడారు. శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజులు మంగళవారం ఉదయమే కోర్టుకు చేరుకున్నారు. శ్రీనుతో తల్లి చాలాసేపు మాట్లాడారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘ముఖ్యమంత్రి గారూ.. కోడి కత్తి కేసులో కోర్టుకు రండి.. ఎన్‌వోసీ ఇవ్వండి’ అనే డిమాండ్‌తో వివిధ దళిత సంఘాలు (విదసం) ఐక్య వేదిక విశాఖలోని జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు సమాయత్తమైంది. ధర్నాకు పోలీసులు ఇచ్చిన అనుమతి రద్దు చేయడంతోపాటు సోమవారం అర్ధరాత్రి నుంచి విదసం నాయకులను గృహనిర్బంధం చేశారు. తమను నిర్బంధించడం దారుణమని విదసం ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మండిపడ్డారు.
Kodi Katti Sreenivas Mother ‘హంతకులు బయట తిరుగుతున్నారు.. నా కొడుకు జైల్లో మగ్గుతున్నాడు’
Kodikatti case accused parents are suffering: ఎంతో కష్టపడి వాయిదాలకు వస్తున్నాం. ముఖ్యమంత్రి వస్తే ఒక నమస్కారం చేసి ఇక్కడే చనిపోవాలనుకున్నా. ఇన్నేళ్లుగా ఎందుకు తిప్పిస్తున్నారు? ఆరోగ్యం సహకరించకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చా. నా కొడుకును ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఐదేళ్లయినా ఎటూ తేలడం లేదు. సీఎం ఒక్కసారైనా రావాలి కదా! నన్ను పొడిచాడనో, లేదనో.. ఏదో ఒకటి చెప్పాలి. ఠాణేలంక పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తే పోలీసులు గృహనిర్బంధం చేశారు. కోర్టులు మారుతున్నాయే తప్ప న్యాయం జరగడం లేదు.
ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు రావాలని గతంలో సీఎంవో నుంచి ఫోన్ వస్తే ఆశగా వెళ్లాం. ఆయనకు తీరిక లేదని, మరోసారి పిలుస్తామని చెప్పడంతో తిరిగి వచ్చేశాం. నాలుగేళ్లుగా మా సోదరుడు జైల్లో మగ్గుతున్నాడు. ముఖ్యమంత్రి వస్తేనే కేసు పరిష్కారమవుతుంది. ఇప్పటికైనా ఎన్‌వోసీ ఇప్పించాలి. ఈ కేసులో చట్టప్రకారం మూడున్నరేళ్ల శిక్ష పడే అవకాశముంది. కానీ ఐదేళ్లుగా కఠిన జైలు జీవితం గడుపుతున్నాడు. దళిత, నిరుపేదలమైన మాకు న్యాయం జరగడం లేదు. బతకలేకపోతున్నాం. న్యాయం కోసం రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తాం. ప్రతి జిల్లాలో దళిత నాయకులు మాకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నారు.