తమిళనాడులో ఓ జంట.. విమానంలోనే ఘనంగా వివాహం చేసుకుంది. నూతన వధూవరులు తమిళనాడులోని మదురై జిల్లా కోరిప్పాళ్యం, మదురైలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల సంతానం. వీరి పెళ్లికోసం పెద్దలు ఓ ప్రైవేట్ విమానాన్ని బుక్ చేశారు.
ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో 161 మందితో విమానం మదురై నుంచి తూత్తుకుడికి బయలుదేరింది. వధూవరులు, కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే విమానం ఎక్కారు. వీరందరికీ ముందుగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించి నెగెటివ్‌గా తేలిన తర్వాత ప్రయాణానికి అనుమతించారు.
కాసేపటి తర్వాత వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్ తాళి కట్టారు. విమానం తూత్తుకుడికి వెళ్లి, తిరిగి మదురైకి చేరుకుంది.
డీజీసీఏ సీరియస్..
విమానంలో వివాహం ఘటనపై.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాహంలో కొవిడ్ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి విమాన సిబ్బందిని సస్పెండ్ చేసింది.
ఇదీ చదవండి: కూతురి పెళ్లికి తండ్రే పురోహితుడు