couple murder Rajkot: తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కూతురిని, అల్లుడిని హత్యచేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగింది. మృతులను రీనా సింగ్రాఖియా (20), అనిల్ మహిదాగా (22) గుర్తించారు పోలీసులు. ఆరు నెలల క్రితం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా రీనా.. అనిల్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇష్టం లేని రీనా తండ్రి సోంజీభా, సోదరుడు సునీల్... దంపతులను కత్తితో పొడిచి చంపారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. సోంజీభాను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరో నిందితుడు సునీల్ కోసం గాలిస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్గంజ్లో మరో పరువు హత్య వెలుగు చూసింది. వాల్మీకి వర్గానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపినందుకు.. తన కూతురిని గొంతునులిమి హత్య చేశాడు ఓ వ్యక్తి. యువతి సోదరులు సైతం హత్యకు సహకరించారు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని నదిలో పడేశాడు. సదర్ కొత్వాలీ ప్రాంతంలోని కనార్ ఖేడా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మృతురాలి సోదరుల కోసం గాలిస్తున్నారు.
వ్యాన్ ఢీకొట్టి: స్కూల్ వ్యాన్ ఢీకొట్టడం వల్ల నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే.. వ్యాన్‌లో ఇంటికి తిరిగి వచ్చాడు సిద్ధార్థ్. ఇంటి ముందు ఆగగానే వ్యాన్ నుంచి కిందకు దిగాడు. అయితే, ఆ సమయంలో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్.. చూసుకోకుండా వ్యాన్‌ను పక్కకు మళ్లించాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని.. అతడి తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. గాయాల తీవ్రత తక్కువ అని భావించినప్పటికీ.. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా బాలుడి ప్రాణాలు పోయాయని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. చికిత్స కోసం గంటల పాటు వేచిచూడాల్సి వచ్చిందని వాపోయాడు. నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి యాజమాన్యం, స్కూల్ నిర్వాహకులపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
రీఛార్జ్‌కు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య: మొబైల్ గేమ్స్‌కు బానిసైన ఓ 14 ఏళ్ల బాలుడు.. డేటా రీఛార్జ్‌కు తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఎవరూ లేని సమయంలో బాలుడు తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడని, అందుకే డబ్బులు ఇవ్వలేకపోయాడని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.
కన్న కూతురిపైనే: 14 ఏళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశంబిలో జరిగింది. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు 45 ఏళ్ల నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు నిమిత్తం స్థానిక ఆసుపత్రికి పంపామని తెలిపారు.
వీడియోలతో బ్లాక్ మెయిల్: ఓ మహిళకు సంబంధించిన అభ్యంతరకరమైన చిత్రాలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తోన్న ఓ వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఘజియాబాద్‌లోని నివాసం ఉంటున్న యోగిందర్ అలియాస్ కాలా ఏడాది క్రితం ఓ మహిళతో పరిచయమైంది. కొన్ని రోజులకు ఆ మహిళ స్నానం చేస్తున్న వీడియోను పెట్టమని కాలా అడిగాడు. ఆమె పెట్టిన వీడియోతో పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన చెల్లెలుకు చెప్పింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
అమ్మమ్మతో కలిసి విషం: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 80 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవడు మౌర్య(40) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మౌర్య విషం తాగే ముందు తన అమ్మమ్మకు విషం కలిపిన ఆహారం పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.మౌర్య భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కుటుంబంలో విభేదాలకు కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పోర్న్ చిత్రాల్లో నటించిందని అనుమానం.. భార్య దారుణ హత్య