Couple Kills Old Woman : గుజరాత్లో ఓ వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేసిన ప్రేమజంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసకు బావామరదళ్లు అయ్యే యువతీయువకులు.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా కలిసి ఉండాలనే ఆలోచనతో ఈ నేరానికి పాల్పడ్డట్లు తేల్చారు.
ఇదీ జరిగింది..
కఛ్ జిల్లాలోని భచౌ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న జెతిబెన్ ఆనంద్జీ గాలా(87) అనే వృద్ధురాలు శుక్రవారం అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. వృద్ధురాలు కనిపించటం లేదని ఇంటి పక్కనే ఉంటున్న ధరమీ సతారా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలి ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు చెక్ చేసినప్పుడు పోలీసులకు అనుమానాస్పదంగా ఓ వ్యక్తి.. బ్యాగ్‌ను తీసుకు వెళ్తూ కనిపించాడు. ఇంకా ఆ దిశగా పోలీసులు దర్యాప్తును కొనసాగించారు. ఆ వ్యక్తి బ్యాగ్‌ను తీసుకెళ్లిన దుకాణంలోకి వెళ్లి చూశారు. అక్కడ ఒక సూట్‌కేసు కనిపించింది. చూస్తే వృద్ధురాలి మృతదేహం ఉంది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయం అంతా బయటకు వచ్చింది. ఆ వ్యక్తి ప్రేమించిన అమ్మాయితో కలిసి జీవించటం కోసం ఈ హత్యను చేసినట్లు అంగీకరించాడు.
ఇంట్లో వాళ్లకు తెలియకూడదని.. నిందితులు.. అదే ప్రాంతంలో ఉంటున్న రాజు గణేశ్ ఛంగా, రాధిక వర్షి ఛంగా. వీరు బావామరదళ్లు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కలిసి జీవించటం కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇంట్లో వాళ్లకు దొరకకుండా ఉండటానికి రాధిక చనిపోయినట్లుగా నమ్మించాలని అనుకున్నారు. అందుకోసం ఓ మహిళను చంపి.. ఆ మృతదేహాన్ని రాధికలాగా చూపించాలని ప్రణాళిక రచించారు. అనుకున్న విధంగానే అదే గ్రామంలో నివసిస్తున్న జెతిబెన్ ఆనంద్జీ అనే వృద్ధురాలి హత్య చేశారు. మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి.. పక్కనే మూసి ఉన్న ఓ దుకాణంలో ఉంచారు.
వృద్ధురాలి హత్య మిస్టరీని ఛేదించటం కోసం పోలీసులు 10 బృందాలుగా ఏర్పాటయ్యారు. దర్యాప్తులో భాగంగా సుమారు 2200 గంటల నిడివిగల 170 పైగా సీసీటీవీ రికార్డింగ్‌లు పరిశీలించారు. చివరకు రాజు-రాధికను పట్టుకున్నారు. వీరి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు తెలిశాయి. ఇంతకుముందు కూడా రాధిక చనిపోయినట్లుగా కుటుంబసభ్యుల్ని నమ్మించడానికి ఇద్దరూ ప్రయత్నం చేశారు. స్మశానవాటిక నుంచి ఎముకలు సేకరించి అవి రాధికకు చెందినవని నిరూపించాలని అనుకున్నా.. సాధ్యపడలేదు. ఇప్పుడు ఓ వృద్ధురాలిని హత్య చేసి.. దొరికిపోయారు.