Costliest Saree in India : ఆడవారికి చీరలపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. భాగస్వామి నుంచి అతివలు కోరుకునే వాటిలో చీర ముందు వరుసలో ఉంటుంది. పండగలొస్తే ఈ చీరలు.. భర్తల జేబులకు పెద్ద చిల్లులే పెడతాయి. అలాంటి వారికి ఇప్పుడు చూపించే చీర ధర తెలిస్తే.. వారి అవి అమ్మే దుకాణాల పరిసరాలకు కూడా భార్యలను తీసుకెళ్లేందుకు భయపడతారు. ఎందుకంటే ఆ చీర ధర అక్షరాలా ఇరవై ఒక్క లక్షల రూపాయలు మరి. ఆ చీర విశేషాలు మీకోసం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఓ వస్త్ర దుకాణానికి వెళ్లే మహిళలకు అక్కడ ఉన్న ఇరవై ఒక్క లక్షల రూపాయల చీర మతి పోగొట్టేస్తుందట. వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటి వాటి వల్ల దీనికి ఇంత ధర పలుకుతున్నట్లు వస్త్ర వ్యాపారి తెలిపారు. దీన్ని తయారు చేసేందుకు 2 ఏళ్లు పట్టిందని పేర్కొన్నారు. స్ఫటికాలతో అందంగా అలంకరించిన ఈ చీరకు షిఫాన్, చికంకారీ కుట్లే ప్రత్యేక ఆకర్షణ అని వెల్లడించారు.
"ఈ చీర చాలా ఖరీదైనది ఎందుకంటే దాదాపు పదిహేను రకాల కుట్లు వేసి దీన్ని తయారు చేశాం. సాధారణంగా చికంకారీలో ముప్పై రెండు కుట్లు ఉంటాయి. కానీ ఇందులో వేసిన ప్రత్యేక కుట్ల గురించి అందరికీ తెలిసి ఉండదు. దీనికి కుట్లు వేసేందుకే చాలా సమయం పడుతుంది. ఆ సమయమే ఈ చీర ఇంతటి భారీ ధర పలికేలా చేస్తుంది."
-- వస్త్ర వ్యాపారి
"ఈ చీర తయారీకి చాలా సమయం పట్టింది. రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు కష్టపడి దీన్ని తయారు చేశారు. ఎక్కడా యంత్రాలను ఉపయోగించకుండా పూర్తిగా చేతితో దీన్ని తయారు చేశారు. అత్యంత నాణ్యత గల ఫాబ్రిక్‌ను ఉపయోగించారు. ముద్రణ మరింత నాణ్యంగా అందంగా ఉండేలా చూడాలి."
-- సంతోష్, దుకాణ కార్మికుడు
శ్వేత వర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర దుకాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తోందని దుకాణ యజమాని తెలిపారు. చాలా మంది ఈ చీరను కొనకున్నా చూసేందుకు తరలివస్తున్నారని పేర్కొన్నారు.