COVID cases Maharashtra: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారంతో పోలిస్తే రోజువారీ కొత్త కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం కొత్తగా 2,956 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారితో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబయిలోనే 1,724 కేసులు రావటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 18వేల మార్క్‌ను దాటాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 79,15,418కాగా, మరణాలు 1,47,875కు చేరాయి.
రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే 2,165 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 77,49,276కు చేరింది. రికవరీ రేటు 97.90గా ఉంది. మంగళవారం మొత్తం 36,911 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 79,15,418కాగా, మహమ్మారితో 1,47,875మంది ప్రాణాలు విడిచారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసులు ఠానేలో రెండు నమోదయ్యాయి. బాధితుల్లో 25 ఏళ్ల మహిళ, 32 ఏళ్ల వయసు గల వ్యక్తి ఉన్నారు.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో తాజాగా1,118 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారంతో పోలిస్తే కొవిడ్ కేసుల్లో 82శాతం పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం కొవిడ్ పాజిటివిటీ రేటు 6.5శాతానికి చేరింది. ఇప్పటివరకు మహమ్మారితో 26,223మంది తుదిశ్వాశ విడిచారు. ప్రస్తుతం 3,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవీ చదవండి: పవార్ చుట్టూ రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం- మమత భేటీపైనే అందరి దృష్టి