ఆక్సిజన్ కొరత మరో ప్రాణాన్ని బలితీసుకుంది. పడకలు లభించిక ఆస్పత్రి మెట్ల వద్దే కుప్పకూలాడు ఓ కరోనా రోగి. వైద్యం కోసం అతడి భార్య ఎంత అర్థించినా సహాయం చేసే నాథుడే కరవయ్యాడు. చివరకు ఆమె ఒడిలోనే ఊపిరి వదిలాడు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో బుధవారం జరిగింది.
కరోనాతో బాధపడుతున్న అరుణ్ మాలీ అనే వ్యక్తిని చాంద్వాడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చింది అతడి భార్య. అయితే పడకల కొరత కారణంగా అతడిని చేర్చుకోలేదు. కనీసం ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న మాలీకి ఆక్సిజన్ అయినా అందించాలని అతడి భార్య రోదించినా సహాయం కరవైంది. చికిత్స కన్నా ముందే చావు అతడిని పలకరించింది. దీంతో భార్య కన్నీరుమున్నీరై విలపించింది.
ప్రాణం తీసిన ఆలస్యం!
అయితే అరుణ్ పరిస్థితి దృష్ట్యా.. అతడికి పడక ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అందుకోసం ఆరోగ్యం నిలకడగా ఉన్న ఓ రోగి పడకను ఖాళీ చేసినట్లు వెల్లడించారు. కానీ, అది అతడికి అందించేలోపే మృతిచెందినట్లు వివరించారు.
ఇదీ చూడండి: ఆక్సిజన్ ట్యాంకు లీకేజీ... 24 మంది మృతి