Coonoor Fire dept: తమిళనాడు కూనూర్‌లో హెలికాప్టర్ ప్రమాదం తర్వాత అత్యవసర సేవలు అందించిన స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సదుపాయాల కొరత వేధిస్తోంది. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Tamil Nadu helicopter crash
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ చాపర్ డిసెంబర్ 8న కూలిపోగా.. సమాచారం అందుకున్న వెంటనే కూనూర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉన్న ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.
40 ఏళ్ల కష్టాలు
ఇదే కాదు, ఎన్నో ప్రకృతి విపత్తులు, సహాయక చర్యలు, సైనిక ఆపరేషన్లలో వీరు సేవలందించారు. అత్యంత ప్రతికూల వాతావరణంలో పని చేశారు. వందలాది మంది పౌరులను కాపాడారు. వీరి సేవలను గుర్తిస్తూ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఎన్నో సార్లు ప్రశంసలు కురిపించింది. అయితే, వారికి కనీస వసతులు కరవయ్యాయి. కార్యాలయాల్లో సదుపాయాలను పక్కనబెడితే.. కనీసం వారు ఉండే చోట శౌచాలయాలు కూడా సరిగా ఉండటం లేదు. గడిచిన 40 ఏళ్లుగా ఇదే దుస్థితి అని సిబ్బంది వాపోతున్నారు.
మొత్తం 30 మంది సిబ్బంది కూనూర్ అగ్నిమాపక కేంద్రంలో పనిచేస్తున్నారు. వర్షకాలం వస్తే వీరు ఉండే గదుల్లో నీరు లీక్ అవుతూ ఉంటుంది. విశ్రాంతి గృహాల్లో కూర్చోవడం, టాయిలెట్లు వాడటం కష్టమవుతుంది. పరిసరాల్లో పరిశుభ్రమైన వాతావరణం కూడా ఉండదని సిబ్బంది చెబుతున్నారు. వీటన్నింటినీ భరిస్తూనే కూనుర్ అగ్నిమాపక శాఖ.. మెరుగైన సేవలు అందిస్తోంది. అత్యవసర సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుతోంది.
గ్రామస్థుల్లాగే వీరికీ సాయం చేస్తే..
హెలికాప్టర్ ప్రమాదం తర్వాత నంజప్ప గ్రామస్థులు చేసిన సహాయానికి తమిళనాడు ప్రభుత్వం స్పందించి గ్రామాభివృద్ధికి రూ.2.5 కోట్లు కేటాయించింది. ఇదే విధంగా కూనూర్ అగ్నిమాపక దళానికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. శాశ్వత అగ్నిమాపక కార్యాలయాన్ని నిర్మించాలని అడుగుతున్నారు.
ఇదీ చదవండి: