రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. రాజధాని దిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన్ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి వీ మురళీధరన్‌తో పాటు కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్, పార్టీ సీనియర్ నేతలు తరుణ్ ఛుగ్, అనిల్ బలూనీ తదితరులు పాల్గొన్నారు.
"ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తాము ఒక కుటుంబం కోసం పనిచేస్తున్నామని నమ్ముతారు. కానీ, నేను దేశం కోసం పనిచేస్తున్నానని నమ్ముతున్నాను" అని అనిల్ ఆంటోనీ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
పార్టీ బలోపేతం కృషి చేస్తారని నమ్ముతున్నా: గోయల్
"అనిల్ ఆంటోనీ మంచి వ్యక్తిత్వం కలవారు. రాజకీయాలపై ఈయనకున్న ఆసక్తి, ప్రజల పట్ల సేవ చేయాలనే నిబద్ధత చూస్తుంటే దేశ సుస్థిరాభివృద్ధిపై ప్రధానికున్న దూర దృష్టే కనిపిస్తోంది" అని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అనిల్ దక్షిణాదిలో చాలా చురుకైన పాత్రను పోషించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏకే ఆంటోనీ స్పందన..!
అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడంపై స్పందించిన తండ్రి ఏకే ఆంటోనీ.. ఈ 'తప్పుడు' నిర్ణయం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. 2014 తర్వాత మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఐక్యత, మత సామరస్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు.
తన తండ్రికే ద్రోహం చేశారు: కాంగ్రెస్
అనిల్ బీజేపీలో చేరి తన తండ్రినే మోసం చేశారని కాంగ్రెస్ పేర్కొంది. అనిల్‌కు పార్టీలో ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదని.. ఆయన బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించే విషయమే కాదని కేరళ కాంగ్రెస్ చీఫ్ కె.సుధాకరన్ అన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని బైబిల్లోని ఓ సన్నివేశంతో పోల్చారు పార్టీ రాష్ట్ర చీఫ్. ఇందులో డబ్బు కోసం కొందరు ఏసుక్రీస్తును మోసం చేసినట్లే.. పదవుల కోసం అనిల్ తన తండ్రిని మోసం చేశారని అన్నారు. ఇది ఏకే ఆంటోనీకి కుమారుడు ఇచ్చిన కానుకగా అభివర్ణించారు.
బీజేపీలో చేరకముందు కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న అనిల్ ఆంటోనీ 2023 జనవరిలో ఆ పార్టీని వీడారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీని తప్పు పట్టిన ఆయన కాంగ్రెస్ కమిటీలోనీ అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.