అదానీ వ్యవహారంలో భాజపా ప్రభుత్వం నిజాన్ని బయటపెట్టే వరకు పార్లమెంట్లో ప్రశ్నలు సంధిస్తూనే ఉంటామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. అంతవరకు అదానీకి మద్దుతుగా నిలిచే భాజపా నేతలను తప్పుపడుతూనే ఉంటామని తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం దేశాన్నే బాధిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో ఆదివారం ప్రసంగించారు రాహుల్.
'దేశ స్వాతంత్రోద్యమం కూడా ఓ కంపెనీ కోసమే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో చరిత్ర పునరావృతం అవుతోంది. అదానీ కంపెనీ కూడా దేశ సంపదను, ఓడరేవులను తన గుప్పెట్లో పెట్టుకుంది. దేశంలోని మొత్తం మౌలిక సదుపాయాలను తన చేతుల్లో తీసుకుంటోంది. ప్రస్తుతం భాజపా అదానీ సంపదను మూలను పెట్టి పనిచేస్తోంది. ఈ పని దేశ వ్యతిరేకమైనది. కాంగ్రెస్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదానీ, మోదీకి మధ్య ఉన్న సంబంధాలపై పార్టీ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. అదానీ విషయం పార్లమెంట్లో లేవనెత్తినప్పుడు మా ప్రసంగం రద్దవుతుంది. అదానీ విషయంలో నిజం బయటకు వచ్చే వరకు పార్లమెంట్లో వేలసార్లు అడుగుతాము. ఈ విషయంలో వెనక్కు తగ్గేదే లేదు.'
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఇటీవల 'విజయవంతంగా' ముగిసిన భారత్ జోడో యాత్ర తపస్సు లాంటి మరో యాత్రను దేశవ్యాప్తంగా చేపట్టడానికి పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు రాహుల్ గాంధీ.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భాజపాకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు భాజపా ప్రభుత్వంతో పోరాడే ధైర్యం ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ కోసం కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను ప్రియాంక కొనియాడారు. భాజపా సిద్ధాంతాలను వ్యతిరేకించే వ్యక్తులంతా కలిసి ఐక్యంగా పోరాడాలని ఆమె కోరారు. భాజపా ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. దీనికి ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మండల స్థాయి నుంచే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు ప్రియాంక గాంధీ.