Karnataka CM : కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సీఎల్పీ నేతగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో సిద్ధరామయ్య పేరును పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రతిపాదించారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేంతా సిద్ధరామయ్య పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో ఎవరెవరికి ఏయే మంత్రిత్వ శాఖ ఇవ్వాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ఈసారి కేవలం ఒక్కరికే ఉపముఖ్యమంత్రిగా అవకాశం రావడం వల్ల మిగతా సీనియర్ ఎమ్మెల్యేలంతా తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.
సీఎల్పీ నేత హోదాతో పాటు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకన్నట్లు ఇదే సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సూర్జేవాలా, జితేంద్ర, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిందే పాల్గొన్నారు. కేవలం 20 నిమిషాల్లోనే సీఎల్పీ సమావేశం ముగిసింది.
గవర్నర్‌ను కలిసిన నేతలు
సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా పార్టీ ముఖ్య నేతలంతా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరుతూ.. ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని మెజారిటీ శాసనసభ్యులు చేసిన సంతకాలతో కూడిన లేఖను ఆయనకు సమర్పించారు. అనంతరం గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభకాంక్షలు తెలిపారు.
మాజీ సీఎం అభినందనలు!
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్యకు అభినందనలు తెలిపారు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై. 'మీరు కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను' అని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
మే20న ప్రమాణస్వీకారం
మే 20న(శనివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవా స్టేడియంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ ఛీప్ డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా అదే రోజు ఏర్పాటు కానుందని కాంగ్రెస్ హైకమాండ్ గురువారం ఉదయం ప్రకటించింది. కాగా, మే13న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు సీఎల్పీ సమావేశమైంది. ఈ భేటీలో కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధిష్ఠానం తీర్మానించింది.
Karnataka Election Results : 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకకు మే 10న ఎన్నికలు జరగ్గా.. మే13న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలను గెలుపొందింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113 మ్యాజిక్ ఫిగర్‌ను దాటి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీకి 66 స్థానాలు రాగా.. జేడీఎస్ 19 చోట్ల గెలిచింది.