బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్, సీపీఎం, ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ కలయికతో ఏర్పాటైన 'యునైటెడ్ ఫ్రంట్'కు కాలం చెల్లపోయిందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ(Sitaram Yechury) తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కోల్కతాలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు డాక్టర్ సుజన్ చక్రవర్తి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన(Sitaram Yechury) హాజరయ్యారు. కాంగ్రెస్తో వామపక్షాల బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగాల్ ఎన్నికలకు ముందు.. ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ బంధం పోలింగ్ ముగియగానే.. ముగిసిందని ఏచూరి(Sitaram Yechury) పేర్కొన్నారు. అయితే.. ఆయన కాంగ్రెస్- వామపక్షాల అనుబంధం ముగిసిందని మాత్రం ఆయన ప్రత్యక్షంగా చెప్పలేదు. భవిష్యత్లో మాత్రం ఈ కూటమి కొనసాగదననడానికి బలమైన సూచనలైతే చేశారు. మరోవైపు.. భాజాపాను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, టీఎంసీ సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ క్రమంలో భవానీపుర్ ఉపఎన్నికల్లో మమతకు పోటీగా తమ పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని కూడా నిలబెట్టకపోవడం గమనార్హం.
అయితే.. మమతకు పోటీగా భవానీపుర్ నుంచి సీపీఎం తమ అభ్యర్థిని నియమించింది. దీనిపై ఏచూరిని విలేకరులు ప్రశ్నించగా.. "ప్రతి పార్టీకీ తమ కట్టుబాట్లు తమకు ఉంటాయి. కాంగ్రెస్ వైఖరి ఏంటో ఆ పార్టీ అధినాయకత్వం చెబుతుంది. మా పార్టీ వైఖరి ఏంటో నేను చెబుతాను" అని అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. కాంగ్రెస్- వామపక్షాల బంధం ముగిసిపోయిందని తెలుస్తోంది.
ఇదీ చూడండి: తాలిబన్ల ప్రభుత్వానికి గుర్తింపుపై మోదీ కీలక వ్యాఖ్యలు