ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో... కేంద్ర మంత్రులు, సీనియర్ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు సింగ్.
"ఒకే రాజకీయ పార్టీ(కాంగ్రెస్)లో నేను 32 ఏళ్లు ఉన్నాను. కానీ.. ఆ పార్టీ ఇంతకుముందులా లేదు. సిద్ధాంతాలు మారిపోయాయి. ఇకపై భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కలల్ని సాకారం చేసే దిశగా భాజపాలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తా" అని భాజపాలో చేరిన తర్వాత చెప్పారు సింగ్. తన భార్య సోనియా సింగ్(ఓ జాతీయ ఛానల్లో ఎడిటర్) యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలపై ఆయన స్పందించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లో తానొక్కడినే ఉన్నానని, పార్టీ అధిష్ఠానం చెప్పినట్లు చేస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధినేత్రికి లేఖ
అంతకుముందు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆర్పీఎన్ సింగ్ రాజీనామా లేఖను పంపారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఆర్పీఎన్ సింగ్.. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులుగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో జేఎంఎంతో కలిసి అధికారంలో ఉంది కాంగ్రెస్.
అదే కారణమా?
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సన్నిహితులకు టికెట్ నిరాకరించడమే.. సింగ్ పార్టీని వీడేందుకు కారణమని సమాచారం.
సింగ్.. యూపీ కుషీనగర్ నుంచి గతంలో ఎంపీగా సేవలందించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.
మరో ఎంపీ కూడా..
కాంగ్రెస్ పార్టీకి మరో ఎంపీ గుడ్‌బై చెప్పారు. కార్యకర్తలను విస్మరించారని ఆరోపిస్తూ.. మాజీ ఎంపీ ఆనంద్ ప్రకాశ్ గౌతమ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి పంపించారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగనుంది.
మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
గౌతమ్.. రెండు సార్లు రాజ్యసభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ధైర్యం లేకనే...
సీనియర్ నేతలు పార్టీ వీడడంపై కాంగ్రెస్ స్పందించింది. "కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని కొనసాగించాలంటే ధైర్యం అవసరం. పిరికివాళ్లు ఈ యుద్ధం చేయలేరని ప్రియాంక గాంధీ చెప్పారు." అని అన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!