Congress Freebies In Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఉచిత పథకాల హామీలు కూడా ఇతోధికంగా తోడ్పడ్డాయి. బీజేపీ, జేడీఎస్‌తో పోలిస్తే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ అనేక ఉచిత హామీలు ఇచ్చింది. ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి వంటి నాలుగు హామీలను ప్రధానంగా అమలు చేస్తామని చెప్పింది. ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఉచిత హామీల వ్యూహం ఆ పార్టీకి అనుకూల ఫలితాలను ఇచ్చింది. అయితే ఈ హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుందో.. సాధ్యాసాధ్యాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
- కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 200 యూనిట్లు ఫీ కరెంట్(గృహజ్యోతి) పథకానికి ఏడాదికి రూ.25,800 కోట్లు అవసరం.
- గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతినెల రూ.2వేలు అందజేస్తామని ప్రకటించింది. ఈ హామీని నెరవేర్చుకునేందుకు రూ.30 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
- మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నెరవేర్చేందుకు ఏడాదికి రూ.3 వేల కోట్లు ఖర్చవుతాయి.
- 'యువనిధి' కింద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భత్యం అందజేస్తామని ప్రకటించింది. డిగ్రీ పూర్తిచేసిన వారికి నెలకు రూ.3వేలు.. డిప్లొమా వారికి రూ.1,500 అందిస్తామని వెల్లడించింది. ఈ హామీకి కూడా భారీగానే ఖర్చవుతుందని అంచనా. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 10 కిలోల ఉచిత హామికి భారీగా ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఉచిత హామీలకు అయ్యే ఖర్చు..
Congress Manifesto Karnataka Polls : అయితే కాంగ్రెస్ ఇచ్చిన 3 ప్రధాన ఉచిత హామీలకే రూ.58 వేల కోట్లకుపైనే ఖర్చువుతుంది. దీంతో ప్రభుత్వ ఖజానా తీవ్ర భారం పడుతుంది. అధికారంలోకి వచ్చాక ఎంత మేర ఈ హామీలను అమలు చేస్తుందో వేచిచూడాలి.
రాష్ట్రంపై ఆర్థిక భారం..
ఉచితాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ విజృంభణ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఉచితాలు అమలుకు భారీ ఖర్చు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. 2022-23లో రాష్ట్ర బడ్జెట్‌లో రూ.14,699 కోట్ల రెవెన్యూ లోటు ఉందని.. మూలధన వ్యయానికి నిధుల కొరత ప్రాథమిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.
ఉచిత పథకాల హామీలు ఏ ఎన్నికల్లోనైనా పార్టీల విజయావకాశాలపై కొంత ప్రభావం చూపుతాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్పష్టమైంది. భారతీయ జనతా పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇవి ఆ పార్టీని తిరిగి కన్నడనాట అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదం చేశాయి. అయితే ఈ ఉచిత హామీలు అమలు చేయడం మాత్రం బాగా ఖర్చుతో కూడుకున్న పనే. ఎందుకంటే ప్రభుత్వం ఖజానా నుంచి భారీగా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది.