భవానీపుర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సీఎం మమతా బెనర్జీపై(Mamata Banerjee) పోటీ చేయకూడదని కాంగ్రెస్ ప్రకటించింది. ఏఐసీసీ(AICC) ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పీసీసీ ఛీఫ్ అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారు. 'మమతా బెనర్జీపై కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టదు. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయదు' అని అధిర్ రంజన్ చౌదరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై పీసీసీలో మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఉన్నారని ఆయన ప్రస్తావించడం గమనార్హం.
మరోవైపు, కాంగ్రెస్ నిర్ణయంపై సీపీఎం(CPM) నేత సుజన్ చక్రవర్తి స్పందిస్తూ.. 'రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయం అవసరం కనుక మా పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడతాం' అని అన్నారు. అయితే తమ నిర్ణయాన్ని మార్చుకోమని కాంగ్రెస్‌కు సూచించలేమని తెలిపారు.
అయితే కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొంది.
ఎమ్మెల్యే పదవి త్యాగం..
ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగాల్‌కు ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. జంగీపుర్, సంసీర్ గంజ్ అభ్యర్థుల అకాల మరణాల కారణంగా ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే భవానీపుర్ నుంచి పోటీ చేసి గెలిచిన టీఎంసీ నేత సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ్.. మమత కోసం ఎమ్మేల్యే పదవిని త్యాగం చేశారు. ఆయన రాజీనామా వల్లే ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఛటోపాధ్యాయ్ భాజపా అభ్యర్థిపై 28వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందడం గమనార్హం.
ఏప్రిల్‌లో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు టీఎంసీ 213 కైవసం చేసుకుంది. భాజపా 77 చోట్ల గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఎన్నికల అనంతరం ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకర్గం నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఇవీ చదవండి: