రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై మరోమారు రాజకీయ దుమారం రేగింది. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ కోరింది. రఫేల్ జెట్లను తయారు చేసే డసో సంస్థ.. కొందరు మధ్యవర్తులకు ముడుపులు చెల్లించిందన్న వార్తలపై ప్రధాని జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వాదనల్ని తోసిపుచ్చిన భాజపా... విపక్షంపై ఎదురుదాడికి దిగింది.
రాహుల్ అన్నదే నిజమైంది!
2016లో రఫేల్ ఒప్పందం జరిగిన తర్వాత విమాన తయారీదారు 'డసో' సంస్థ మధ్యవర్తిగా వ్యవహరించిన భారత కంపెనీ 'డిఫ్సిస్' సొల్యూషన్స్‌కు రూ.9 కోట్ల 48లక్షలు చెల్లించిందని ఫ్రెంచ్ అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో తేలినట్లు ఫ్రెంచ్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని విమర్శనాస్త్రాలుగా మలుచుకుంది కాంగ్రెస్. రఫేల్ ఒప్పందంలో అవినీతి జరగిందని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ చేసిన ఆరోపణలు నిజమయ్యాయని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
'దేశ అతిపెద్ద రక్షణ ఒప్పందంలో భారత ప్రభుత్వంలో ఎవరికి, ఎంత మేరకు లంచాలు అందాయో తేల్చేందుకు దర్యాప్తు అవసరం లేదా?' అని ప్రశ్నించారు సుర్జేవాలా. ఈ ప్రశ్నలకు ప్రధాని మోదీనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డసో సంస్థ మధ్యవర్తికి చెల్లించిన ఆ మొత్తాన్ని తమ ఖర్చుల ఖాతాలో క్లయింట్స్‌కు గిఫ్ట్ ఇచ్చినట్లు నమోదు చేసిందని ఆయన చెప్పారు. కానీ నిజానికి ఆ మొత్తం మధ్యవర్తికి చెల్లించిన కమీషన్ అని ఆరోపించారు. రక్షణ ఒప్పందంలో మధ్యవర్తికి కమీషన్ ఇవ్వటం భారత ఆయుధ కొనుగోళ్ల విధానాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.
ఖండించిన భాజపా
కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. విమానాల కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు, కాగ్ ఇప్పటికే తేల్చాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అవినీతి కేసులో యడియూరప్పకు ఊరట