Agnipath Sonia Gandhi: సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. యువకుల డిమాండ్లను విస్మరించడం దురదృష్టకరమని అన్నారు. దిశానిర్దేశం లేకుండా ఆ పథకాన్ని రూపొందించారని ఆరోపించారు.
నిరసన కార్యక్రమాలను అహింస మార్గంలో చేయాలని యువతను కోరారు సోనియా. దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న యువతకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకునే వరకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కోలుకుంటున్న సోనియా.. కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ.. సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె క్రమంగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. కొవిడ్ బారినపడినందున సోనియా జులై 13న ఆసుపత్రిలో చేరారు. సోనియా దిగువ ఊపిరితిత్తులకు వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ శుక్రవారం తెలిపారు.
మరో వైపు, నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో జూన్ 8న ఈడీ ముందు విచారణకు సోనియా గాంధీ హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపించింది. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా కోరారు. దీంతో ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ED అధికారులు 3 రోజులపాటు ప్రశ్నించారు. నాలుగో రోజు కూడా సమన్లు పంపినప్పటికీ..ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియా వద్ద ఉండాల్సి ఉన్నందున విచారణ వాయిదా వేయాలన్న రాహుల్ విజ్ఞప్తికి ఈడీ అంగీకరించింది.
ఇవీ చదవండి: 'ఆ విషయంలో తగ్గేదే లే'.. అగ్నిపథ్ పథకంపై రాజ్‌నాథ్
'అగ్నిపథ్'పై ఆగని ఆందోళనలు.. బస్సులకు నిప్పు.. పోలీసుల లాఠీఛార్జ్