అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సహా అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ విభజనకు యత్నించే రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ధ్వజమెత్తారు. మార్గరీటాలో ఓ సభలో మాట్లాడుతూ ఓటుబ్యాంకు రాజకీయం చేయడం భాజపా విధానం కాదని చెప్పారు.
"అసోం ప్రతినిధిగా 15 ఏళ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి(మన్మోహన్ సింగ్) ఉన్నా.. రాష్ట్రంలోకి అక్రమ వలసలను కాంగ్రెస్ కట్టడి చేయలేకపోయింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుంది. అసోంలో బద్రుద్దీన్ అజ్మల్‌కు చెందిన ఏఐయూడీఎఫ్‌తో, కేరళలో ముస్లిం లీగ్‌తో, బంగాల్లో ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్‌తో ఆ పార్టీ జట్టుకట్టింది. అజ్మల్ చేతిలో అసోం సురక్షితంగా ఉండదు. తమ సంక్షేమం గురించి ప్రధాని మోదీ, అజ్మల్లో ఎవరు ఎక్కువ పట్టించుకుంటారో ప్రజలే నిర్ణయించుకోవాలి."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
భాజపా అభివృద్ధిని నమ్ముకుంటే.. కాంగ్రెస్ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని టిన్‌సుకియా బహిరంగ సభలో ఆరోపించారు అమిత్ షా.
"కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చి వేర్వేరు జాతులు, వేర్వేరు వర్గాల గురించి మాట్లాడుతుంది. ప్రజల మధ్య భేదాభిప్రాయాలు, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. అది వారి రాజకీయ పద్ధతి. అలాంటి పద్ధతి కలిగి ఉన్నందుకు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు. కానీ మేం మాత్రం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో పని చేశాం."
-అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
ఐదేళ్ల పాలనలో కజిరంగా జాతీయ పార్కు స్థలాన్ని, మత సంస్థల భూములను ఆక్రమించిన చొరబాటుదారులను భాజపా తరిమేసిందని అమిత్ షా చెప్పారు. అసోంను ఆందోళన రహిత, ఉగ్రవాద రహితంగా మార్చి తన హామీని నెరవేర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అసోం శాంతి, అభివృద్ధిని అనుభూతి చెందుతోందని, చొరబాట్ల సమస్య పరిష్కారానికి మరో ఐదేళ్లు తమకు అవకాశం ఇవ్వాలని అమిత్ షా కోరారు.
శాంతి, అభివృద్ధికే ఓటు..
మరోవైపు బిశ్వంత బహిరంగసభలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. భాజపా హయాంలో ఉగ్రవాదం తగ్గి, శాంతి, సుస్థిరత నెలకొన్నాయని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అనేక ఉగ్రవాద సంస్థలు ఆయుధాలు వీడి శాంతిబాటలోకి వచ్చాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: కేరళలో 115 స్థానాల్లో భాజపా పోటీ