బంగాల్ ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఈ విజయం తర్వాత తమ లక్ష్యం దిల్లీపైనేనని చుంచురాలో టీఎంసీ నిర్వహించిన ప్రచార సభలో చెప్పారు. బీజాపుర్ ఎన్కౌంటర్, కరోనా విజృంభణ వంటి అంశాలను ప్రస్తావించిన మమత... ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
"కాలికి గాయం అయినా ఒంటికాలుతో బంగాల్లో విజయం సాధిస్తాం. రెండు కాళ్లతో దిల్లీ పీఠాన్ని అధిష్ఠిస్తాం. బంగాల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి దేశాన్ని భాజపా సరిగా పాలించట్లేదు. అభ్యర్థుల కొరత ఉన్నందునే సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా దించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నన్ను "దీదీ... ఓ దీదీ" అని హేళనగా పిలిచినా పట్టించుకోను."
--మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
హూగ్లీ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తపన్ దాస్ ముజుందార్, తపన్ దాస్ గుప్తా కొన్ని పారపాట్లు చేశారని బహిరంగంగా అంగీకరించారు మమత. వారిని క్షమించి, మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి: నక్సల్స్ ఎత్తుగడలు తెలిసీ- చిక్కుకుంటున్న బలగాలు