Competitive Authority Quota Seats to TS Students : రాష్ట్రంలో 2014 జూన్ తర్వాత కాంపిటీటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నట్లు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల ఆడ్మిషన్ నిబంధనలు-2017ను సవరిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేసి, నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 371-డి నిబంధనల ప్రకారం ప్రవేశ నిబంధనలను సవరించినట్లు ఆయన తెలిపారు.
ఇదివరకు ఉన్న నిబంధనల ప్రకారం వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో.. 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా కాగా, మిగితా 15 శాతం అన్‌రిజర్వుడ్ విభాగానికి చెందుతాయి. పునర్విభజన చట్టం నేపథ్యంలో ఈ సీట్లకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులూ పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైనా.. 36 మెడికల్ కాలేజీల్లో 100 శాతం కాంపీటీటివ్ అథారిటీ కోటా సీట్లన్నింటినీ తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు.
Medical Competitive Authority Quota Seats : ఈ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు 520 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా లభించనున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కలిపి మొత్తం 20 కళాశాలలు ఉండగా, వాటిలో 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. అందులో కాంపిటీటివ్ కోటా కింద ఉన్న 1,895 సీట్లలో 15 శాతం (280సీట్లు) ఉమ్మడి కోటా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులూ పోటీపడేవారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య కళాశాల సంఖ్య 56కు పెరగ్గా.. సీట్లు సంఖ్య 8440కి పెరిగింది. పాత విధానమే కొనసాగితే కొత్తగా నిర్మించిన 36 వైద్య కళాశాలల్లోను 15 శాతం ఉమ్మడి కోటా అమలు చేయాలి. దీనివల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతారని గుర్తించిన ప్రభుత్వం.. ఉమ్మడి కోటాను పాత 20 కాలేజీలకే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన.. 36 కాలేజీలల్లోని కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లన్ని తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.
MBBS Competitive Authority Quota Seats : గతంలో ఎంబీబీఎస్ బీ కేటగిరిలో లోకల్ రిజర్వేషన్ వర్తింపజేయడం వల్ల 85 శాతం అంటే.. 1300 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అదనంగా 520 సీట్లు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలతో మొత్తం 1820 మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు అదనంగా పొందనున్నారు.
తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే.. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యమంత్రి టీ. హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఏళ్లుగా వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలు ఇప్పుడు దగ్గరవుతున్నారన్నారు. ఈ నిర్ణయంతో అదనంగా లభించిన మెడికల్ సీట్లను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య రంగంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాదించిందని తెలిపీరు. జిల్లాకో వైద్య కళశాల ఏర్పాటుతో దేశానికే ఆదర్శంగా నిలించిందని హరీశ్‌రావు వెల్లడించారు.
ఇవీ చదవండి: