భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా.. ఇరుదేశాల మధ్య ల్యాండ్‌లైన్ కనెక్షన్‌కు ఢోకా ఉండదు. అధినేతల స్థాయిలో ప్రతిష్టంభన నెలకొన్నా.. సరిహద్దులో ఫోన్లు మోగకుండా ఆగవు. సైన్యం మధ్య నిరంతరం కాల్పులు జరుగుతున్నా.. సమాచార మార్పిడి నిలిచిపోదు. అంతటి సదృఢం ఈ ల్యాండ్‌లైన్ కనెక్షన్. ఇది కేవలం సమాచార మార్పిడి సాధనమేకాదు.. ఇరుదేశ సైన్యాల మధ్య సమన్వయం పెంపొందించే జీవనాధారం!
పరిస్థితులు ఉండే సరిహద్దులో గస్తీ కాసే సైన్యాలకు ఈ ఫోన్ లైన్లు అత్యంత కీలకం. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ల్యాండ్‌లైన్ సాధనాన్ని కొనసాగించడం అనివార్యం.
"అధినేతల స్థాయిలో విస్తృత, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నప్పటికీ.. ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేది సైనికులే. కాబట్టి అత్యంత క్లిష్టమైన సమస్యలు ఎదురైనా.. సమాచార మార్పిడి ఎప్పుడూ కొనసాగుతుంది. సరిహద్దులోని బలగాలకు ఇవే నిజమైన లైఫ్లైన్లు."
-పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఆర్మీ సీనియర్ అధికారి
చైనాతోనూ సంభాషణలు
పాకిస్థాన్ మాత్రమే కాకుండా చైనాతోనూ ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. చైనా పీఎల్ఏ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ), భారత సైన్యం మధ్య సమాచార మార్పిడి కోసం దౌలత్ బేగ్ ఓల్డీ(లద్దాఖ్), చుషూల్(లద్దాఖ్), బమ్-లా(అరుణాచల్ ప్రదేశ్), నాథు-లా(సిక్కిం), కిబితు(అరుణాచల్ ప్రదేశ్) వద్ద ఐదు ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయి. ఈ సరిహద్దు పాయింట్ల వద్ద ప్రతి చోటా ఓ ఫోన్ లైన్ ఉంటుంది. దగ్గర్లోని చైనా సైనిక పోస్టును సంప్రదించేందుకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి.
కాల్స్ టైమింగ్ ఇదే!
ఈ స్థావరాల వద్ద ఉండే ఇరుదేశాల కమాండర్లు ఏటా పలు మార్లు తప్పకుండా కలుసుకుంటారు. అయితే, ఇక్కడి బార్డర్ పోస్టులకు ఫోన్ కాల్స్ మాత్రం రోజూ వెళ్తాయి. ఇరుదేశాల సైన్యం టెస్ట్ కాల్స్‌ను చేసుకుంటాయి. స్థావరం, ప్రదేశాన్ని బట్టి ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో మార్పులు ఉంటాయి.
ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న సైనిక పోస్టులు.. ప్రతిరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఫోన్ చేసుకుంటాయి. పరిస్థితులు సవ్యంగానే ఉన్నాయని చెప్పేందుకు ఈ ఫోన్‌కాల్ తప్పనిసరి. దీన్నే సైన్యంలో 'ఆల్ ఓకే కాల్'గా చెబుతుంటారు.
తూర్పు లద్దాఖ్‌లో ఇటీవల భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సమయంలోనూ ఈ ఫోన్‌కాల్స్ ఆగలేదు. గల్వాన్ రక్తపాతం జరిగినప్పుడు కూడా 'ఆల్ ఓకే కాల్స్' సవ్యంగా కొనసాగాయి.
భారత్-పాకిస్థాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్(డీజీఎంఓ) స్థాయిలో డైరెక్ట్ 'హాట్‌లైన్' వెసులుబాటు ఉంటుంది. 24/7 ఇది అందుబాటులో ఉంటుంది. పాకిస్థాన్ సరిహద్దులోని ఇతర పోస్టుల్లోనూ ఇలాంటి ఫోన్లైన్లు ఉంటాయి. ఇందులో పూంచ్-రావల్కోట్ క్రాసింగ్ కేంద్రాల వద్ద ఉండేది మరింత ప్రత్యేకం.
"భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు(పాక్ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు) ఇరువైపులా టెలిఫోన్లు మోగుతాయి. స్థానిక అంశాలపై సమాచార బదిలీ జరుగుతుంది. చాలా వరకు ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనపైనే ఉంటుంది. మృతుల వివరాలు, మృతదేహాలను తరలించడంపైనే దాదాపు చర్చించుకుంటారు. ఏదైనా విమానం తమ గగనతలానికి సమీపంలోకి వెళ్తే.. వాటిపై ప్రస్తావన ఉంటుంది. ఇలాంటి స్థానిక అంశాలే ఎక్కువగా ఉంటాయి. దళాల మధ్య అవగాహన లోపంతో ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ఈ సమాచార మార్పిడి ఉపయోగపడుతుంది."
-సైన్యంలోని సీనియర్ అధికారి
పుల్వామా, ఉరీ దాడుల సమయంలోనూ భారత్-పాక్ సరిహద్దులో ఈ ఫోన్‌కాల్స్ కొనసాగాయి. సరిహద్దులో నిరంతరం మోర్టార్ షెల్లింగుల దాడులు జరగడం వల్ల పౌరులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుంటారు. వీటిని నివారించేందుకు ఇరుదేశాల సైన్యం సమాచార బదిలీ చేసుకుంటాయి.
ఈ ఏడాది 2021 జనవరి 28 నాటికి 299 సార్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది. 2017లో 971, 2018లో 1629, 2019లో 3168, 2020లో 5133 సార్లు ఈ ఒప్పంద ఉల్లంఘన జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూచ తప్పకుండా పాటించాలని ఇరుదేశాల డీజీఎంఓలు ఈ ఏడాది ఫిబ్రవరి 24న అంగీకారానికి వచ్చారు. దీన్ని అమలు చేయాలన్న ఏకైక అజెండాతో బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారులు శుక్రవారం పూంచ్-రావల్కోట్ పాయింట్ వద్ద సమావేశమయ్యారు.
(రచయిత-సంజీవ్ బారువా, సీనియర్ పాత్రికేయులు)