వారంతా సంప్రదాయ పద్దతిలో తేనెను సేకరించే గిరిజన ప్రజలు. వీరంతా మహారాష్ట్రలోని అమరావతి జిల్లా.. మెల్ఘాట్ పర్వత శ్రేణిలో నివాసం ఉంటున్నారు. సాత్పుర పర్వతాలకు చుట్టుపక్కల ఉన్న అడవుల్లో తేనేను సేకరించి.. అమ్మడమే వారి ప్రధాన విధి. ఏళ్లుగా వారంతా ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి శ్రమను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. శాస్త్రీయ పద్ధతిలో తేనే ఉత్పత్తి చేయడం నేర్పించింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ అధ్వర్యంలో వీరికి ప్రత్యేక శిక్షణను ఇచ్చింది.
అమ్జారి గ్రామానికి చెందిన 250 మందికి.. తేనె సేకరణ, శుద్ధి, ప్యాకేజింగ్, పంపిణీలో వారికి ప్రత్యేక శిక్షణను అందించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అమరావతి జిల్లా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అధికారి ప్రదీప్ చెచ్రే, స్పూర్తి క్లస్టర్ డైరెక్టర్ సునీల్ భలేరావు అధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రామ ప్రజలంతా శాస్త్రీయ పద్ధతిలో నాణ్యమైన తేనెను సేకరించి ఉత్పత్తి చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తేనెను విక్రయిస్తున్నారు.
వీరు ఎరుపు, పసుపు, నలుపు రంగులలో ఈ తేనెను ఉత్పత్తి చేస్తూ.. తమ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. తేనే రంగు, రుచి అనేది.. తేనేటీగలు, అవి తాగిన పువ్వుల మకరంధంపై ఆదారపడి ఉంటాయని అమ్జారీ గ్రామ వాసులు చెబుతున్నారు. మెల్ఘాట్ అటవీ ప్రాంతంలో ఎక్కువగా మోహ చెట్లు ఉంటాయి. ఎండాకాలంలో ఈ చెట్లు బాగా చిగురిస్తాయి. ఈ చెట్ల నుంచే తేనెటీగలు ఎక్కువగా తేనెను సేకరిస్తాయి. ఈ తేనెలో 'బి' విటమిన్ ఎక్కవగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే దగ్గు, జలుబు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మార్చి నెలలో ఇక్కడ ఊదా చెట్లు ఎక్కువగా వికసిస్తాయి. దీంతో ఈ కాలంలో ఊదా తేనె లభిస్తుంది. దీనికి ప్రత్యేక మైన చేదు రుచి ఉంటుంది. దీంతోపాటుగా ముదురు రంగులో ఉంటుంది. ఈ తేనె చాలా తక్కువ పరిమాణంలో లభిస్తుంది. దీనికి దేశవ్యాప్తంగా మంచి గిరాకి ఉందని అమ్జారీ ప్రజలు చెబుతున్నారు.
చికల్దార తేనెకు కూడా దేశంలోని చాలా చోట్ల మంచి డిమాండ్ ఉంది. తేనె ఉత్పత్తితో చికల్దార, అజ్మారి గ్రామాల యువత.. మంచి ఉపాధిని పొందుతున్నరన్నారని.. స్పూర్తి క్లస్టర్ డైరెక్టర్ సునీల్ భలేరావు అన్నారు. సహజ వనరుల పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో యువత, మహిళలకు ఉపాధి అవకాశాల కోసం ఈ గ్రామాల ప్రజలకు శిక్షణ ఇచ్చినట్లు అధికారుల తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో తేనెను సేకరించి తదనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.