Clashes in Telangana Polling Stations 2023 : శాసనసభ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రంగారెడ్జి జిల్లా రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు(BRS Leaders) బాహాబాహీకి దిగాయి. మణికొండలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని.. కాంగ్రెస్ వర్గీయులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి యూపీఎస్ పాఠశాల వద్ద ఓటువేసేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేశారంటూ.. చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారీతీసింది. హుజూర్‌నగర్ వి.వి మందిర్ పాఠశాలలో ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఆయన అనుచరులు గులాబీ కండువాలతో రావడంపై సీఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సీఐ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా కొలనుపాకలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేంద్రరెడ్డి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించారంటూ.. కాంగ్రెస్ నాయకులు(Telangana Congress Leaders) అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన రాళ్లదాడిలో మహేందర్‌రెడ్డి కారు పాక్షికంగా దెబ్బతింది. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్ ఫిర్యాదుతో బీఎల్వోని పోలీసులు బయటకు పంపించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం : పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో పుట్ట మధు వెంట కార్యకర్తలు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశిస్తున్నారని.. కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి పోలింగ్ కేంద్రంలో పోలీస్ సిబ్బంది కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఓటువేసేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ వెంట ఆ పార్టీ కార్యకర్తలు వచ్చారని.. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కామారెడ్డిలో పోలింగ్ బూత్‌ల వద్ద రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బోధన్ విజయమేరి పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
ఉమ్మడి వరంగల్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతలు - పోలీసుల లాఠీ ఛార్జీ
Congress and BRS Clashes at Polling Stations : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లింగంపల్లి పంచాయతీ బిట్ల తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి వాహనంపై యువకులు దాడి చేశారు. ఓటు వేసే ప్రాంతానికి సునీతారెడ్డి కుమారుడు రావడంతో.. యువకులు వాహనంపై దాడికి దిగారు. సంగారెడ్డి జిల్లా గోపులారం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల బాహాబాహీ.. లాఠీఛార్జికి దారితీసింది. దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం చందాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్‌ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.
Telangana Assembly Elections Polling 2023 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్వల్ప చెదురుమదురు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిట్టెం రాంమొహన్‌రెడ్డి సంగంబండ గ్రామంలో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సమీపంలోకి వెళ్లడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసులు ఎమ్మెల్యేను పంపించి వేశారు. ఉప్పునుంతల మండలం కంసానిపల్లెలో అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల సమీపంలోని కొండపల్లిలోని ఒకే వ్యక్తి.. ఐదుగురు వృద్ధుల ఓట్లు వేస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు, పదర మండలం వంకేశ్వరం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మద్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
పోలింగ్ కేంద్రం వద్ద మహిళల ఆందోళన - మద్యం, డబ్బుల పంపకాల్లో వివక్ష చూపారని నిరసన
Telangana Assembly Elections 2023 : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిలా వరంగల్ పడమర కోటలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. అదే పోలింగ్ కేంద్రంలో ఆర్పీగా పనిచేస్తున్న ఓ మహిళ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని అధికారులు ఆమెను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తలెత్తిన ఘర్షణ లాఠీఛార్జికి దారితీసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మైలారం గ్రామంలోని బూత్ సందర్శనకు వచ్చిన సమయంలో ఈ గొడవ జరిగింది.
పినపాకలోని ఏడూళ్ల బయ్యారం పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావును కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పోలింగ్ కేంద్రంలోకి కార్యకర్తలతో వెళ్లేందుకు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి యత్నించగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన రేగా కాంతారావు - అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు