Cigarette Offering Temple in Karnataka : ఏ గుళ్లో అయినా.. దేవుడికి కొబ్బరికాయలు కొట్టి, అగరబత్తులు వెలిగిస్తుంటారు. కానీ కర్ణాటక బెళగావిలో ఉన్న ఆలయంలో మాత్రం అమ్మవారికి సిగరెట్లు వెలిగించి పూజలు చేస్తున్నారు. తమ శక్తిమేర మద్యాన్ని కొనుక్కొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు చేసేది హిజ్రాలు కావడం ఇక్కడి మరో ప్రత్యేకత.
Karnataka Belagavi Cigarette Temple : సిగరెట్లు, మద్యంతో పూజలు జరుగుతున్న ఆలయం జిల్లాలోని గోకక్ తాలుకా, కదబగట్టి హిల్ ప్రాంతంలో ఉంది. శ్రీ చౌదేశ్వరీ దేవి ఆలయంలో ఇలా వినూత్న పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలు తీర్చాలంటూ భక్తులు.. ఆలయంలోని చెట్టుకు కొబ్బరికాయలతో ముడుపులు కడతారు. అనుకున్నవి నెరవేరగానే.. పువ్వులు, ఫలాలు, నూనె, కొబ్బరికాయలతో పాటు మద్యం, సిగరెట్లను అమ్మవారికి సమర్పించుకుంటారు. శుక్రవారం 'జాతర మహోత్సవం' నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చారు.
నాగుల పంచమికి నిజమైన పాముకు పూజలు.. ఇంటికి తీసుకొచ్చి హారతి.. దండలతో అలంకరణ!
ఆలయంలో పూజలందుకునే చౌడేశ్వరీ దేవి సర్పంపై కూర్చొని ఉంటుంది. ప్రతి ఏటా జోకుమార పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, సకల పుష్పాలతో అలంకరిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సత్యప్ప అనే ట్రాన్స్జెండర్ 26 ఏళ్లుగా ఈ ఆలయంలో పూజలు చేస్తున్నారు.
"26 ఏళ్లుగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాం. కోరిక తీరిన తర్వాత తమకు తోచిన విధంగా మద్యం, సిగరెట్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. పిల్లలు లేనివారికి అమ్మవారే సంతానం ప్రసాదించింది. ఇక్కడి అమ్మవారు చాలా శక్తివంతమైనది."
-సత్యప్ప, ఆలయ పూజారి
'కోరికలు తీరుతాయ్'
అమ్మవారు తమ కోరికలను నెరవేరుస్తున్నారని భక్తులు సైతం చెబుతున్నారు. ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకుంటున్నామని.. ఇక్కడికి వచ్చాక తమకు మనశ్శాంతి లభించిందని అంటున్నారు.
"నేను గత 17 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతి లభించింది. అమ్మవారికి పూజలు చేసిన తర్వాత మాకు రెండో సంతానంగా బాబు జన్మించాడు."
-రాచప్ప అమ్మనాగి, భక్తుడు"నేను 24 ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నా. ప్రతి ఏడాదీ అమ్మవారిని దర్శించుకుంటాం. కుటుంబంతో కలిసి వస్తుంటాం."
-అస్రహ్యా, భక్తురాలు
దేశవ్యాప్తంగా ప్రాచుర్యం..
భక్తుల సహకారంతోనే ఆలయం బాగా అభివృద్ధి చెందిందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ ఆలయం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించిందని వెల్లడించారు. కర్ణాటక మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, గోవా రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తున్నారని వివరించారు.