CID Issued a Notice to Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు వాట్సాప్ ద్వారా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో.. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. దాంతోపాటు 41ఏ నోటీసును కూడా వాట్సాప్ ద్వారా జారీ చేశారు. ఈ క్రమంలో తనకు నోటీసులు అందినట్టు వాట్సాప్ ద్వారా నారా లోకేశ్.. సీఐడీ అధికారులకు రిప్లై ఇచ్చారు.
Amaravati Inner Ring Road case Issue: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ వ్యవహారంకి సంబంధించి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం )హైకోర్టు)లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నమోదు చేసిన కేసులో ఆయన పేరును తాజాగా సీఐడీ చేర్చింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ అధికారులు తాజాగా మెమో సమర్పించారు. ఈ కేసులో ఏ14గా లోకేశ్‌ను పేర్కొంది. దీంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
Lokesh Anticipatory Bail Petition in High Court: ఈ నేపథ్యంలో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిపింది. విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
CID Officials Sent Notices to Lokesh: ఈ క్రమంలో శనివారం నారా లోకేష్‌కు వాట్సాప్ ద్వారా సీఐడీ అధికారులు నోటీసు పంపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి.. ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసు తాను అందుకున్నట్లు లోకేశ్..సీఐడీకి వాట్సాప్‌లో తిరిగి సమాధానం ఇచ్చారు. అయితే, టీడీపీ ఎంపీ గల్లా కార్యాలయంలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్లి.. నోటీసు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఈ నెల 4న తేదీన సీఐడీ కార్యాలయంలో విచారణ ఉంటుందని లోకేష్‌కు చెప్పామని అధికారులు తెలిపారు.