లోక్‌సభలో పశుపతి కుమార్ పరాస్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్. ఈ నిర్ణయం పార్టీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు చిరాగ్. ఈ క్రమంలోనే ఐదుగురు అసమ్మతి ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిర్లాకు తెలియజేశారు. మునుపటి నిర్ణయాన్ని సమీక్షించి, లోక్‌సభలో తనను ఎల్జేపీ నాయకుడిగా ప్రకటిస్తూ.. కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్‌ను కోరారు.
"ఎల్జేపీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం.. తమ పార్టీకి నాయకుడు ఎవరు అని నిర్ణయించడానికి పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డుకు అధికారం ఉంటుంది. అందువల్ల లోక్‌సభలో పశుపతి కుమార్ ఎల్జేపీ నాయకుడిగా ప్రకటించే నిర్ణయం.. మా పార్టీ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం" అని లేఖలో పేర్కొన్నారు చిరాగ్.
పార్టీని చీల్చడానికి జేడీయూ కుట్ర
మరోవైపు.. తన తండ్రి రాంవిలాస్ పాసవాన్ జీవించి ఉన్నప్పుడు కూడా ఎల్‌జేపీని చీల్చడానికి కొందరు ప్రయత్నించారని చిరాగ్ ఆరోపించారు. తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలాంటి కుట్ర జరిగిందన్నారు.
చిరాగ్ మద్దతుదారులు ఆందోళన
ఎల్జేపీ నూతన లోక్‌సభాపక్షనేత పశుపతి కుమార్ ఇంటి ముందు.. చిరాగ్ పాసవాన్ మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో పశుపతి ఇంటి వద్ద భద్రతను పెంచారు అధికారులు.
'ఆ అధికారం చిరాగ్‌కు లేదు'
ఐదుగురు రెబల్ ఎంపీలను ఎల్జేపీ నుంచి బహిష్కరించిన తర్వాత.. చిరాగ్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు పశుపతి కుమార్. ఈటీవీ భారత్‌తో మాట్లాడిన పరాస్.. పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమైన హోదాలో చిరాగ్ ఉన్నారని ఆరోపించారు. తన నేతృత్వంలోని బృందాన్ని బహిష్కరించడానికి చిరాగ్‌కు ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు. చిరాగ్ వర్గానికి చెందిన కొన్ని సామాజిక వ్యతిరేక అంశాలు పార్టీని నాశనం చేయటానికి దారితీస్తున్నాయని పరాస్ ఆరోపించారు. "పార్టీ ఆరుగురు ఎంపీలలో ఐదుగురు నాతో ఉన్నారు. అందువల్ల నేను పార్టీని విచ్ఛిన్నం చేయలేదు. పార్టీని రక్షించాను. చిరాగ్‌పై నాకు వ్యక్తిగత కక్ష లేదు. కానీ చిరాగ్.. పార్టీలో ఎవరికీ నచ్చని నిర్ణయాలు తీసుకుంటున్నారు" అని ఆయన అన్నారు.
పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిని జూన్ 17న ఎన్నుకుంటారని తెలిపారు.
ఇదీ చూడండి: Chirag Paswan: ఎల్జేపీపై పట్టుకు నేతల ఎత్తులు