రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా చర్చలు జరిపి ఆపడమే లక్ష్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో పర్యటించనున్నారు. ముచ్చటగా ముడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్‌పింగ్ ఆ హోదాలో మొదటిసారి ఈ విదేశీ పర్యటన చేయనున్నారు. ఇందుకోసం ఆయన మూడురోజుల పాటు రష్యాలోనే పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఉక్రెయిన్‌తో యుద్ధం సహా మరిన్ని కీలక అంశాలపై ఆయన చర్చలు జరపనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను చైనా విదేశాంగ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది.
ఈ పర్యటనలో ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని శాంతియుతంగా చర్చలు జరిపి ముగించాలని జిన్‌పింగ్ కోరనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. ఈ పర్యటన మార్చి 20 నుంచి 22 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఇద్దరి దేశాధ్యక్షులు.. రష్యా, చైనా మధ్య సమగ్రమైన భాగస్వామ్యం, భవిష్యత్తులో వ్యూహాత్మకమైన పరస్పర సహకారంతో పాటు అనేక సంబంధిత అంశాలపై చర్చించనున్నారని రష్యా అధికార భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ చర్చల్లో ద్వైపాక్షిక పత్రాలపై కూడా సంబంధిత అధికారులు సంతకాలు చేస్తారని రష్యా ప్రభుత్వ అధీనంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది.
అధ్యక్షుడు పుతిన్‌తో జిన్‌పింగ్‌కు గత 10 ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని శాంతియుతంగా చర్చలు జరిపి ముగించాలని సూచించేందుకు వెళ్తున్న చైనా అధ్యక్షుడి మాటలను పుతిన్ తప్పక వింటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా జిన్‌పింగ్ ఫోన్లో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఈ విధంగా ఇరు దేశాల మధ్య వైరాన్ని సామరస్యంగా పరిష్కరించడమే ప్రధాన అజెండాతో షీ పర్యటన జరగనుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచినా ఆగకపోవడం వల్ల రష్యాలో చైనా అధ్యక్షుడి పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇక చైనా ఈ యుద్ధానికి సంబంధించి తటస్థ వైఖరిని ప్రదర్శిస్తూనే పరోక్షంగా రష్యాకు సహాయ సహకారాలను కూడా అందిస్తోందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. దీనిని చైనా ఖండించింది. ఇక చైనా విడుదల చేసిన తాజా వివరాల్లో అణ్వాయుధాల వినియోగానికి తాము వ్యతిరేకం అని స్పష్టం చేసింది. అలాగే ఏకపక్షంగా వ్యవహరించే ధోరణికి ముగింపు పలకాలని హితవు పలికింది. ఈ క్రమంలో పాశ్చాత్య దేశాలతో చైనాకు సంబంధాలు దెబ్బతింటున్నాయనే జిన్‌పింగ్ రష్యా పర్యటన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) కాంగ్రెస్ సమావేశాల్లో జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మొత్తం 2,950 మందికి పైగా సభ్యులున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(చైనా పార్లమెంట్)గతవారం జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవం తార్మానం చేసి ఎన్నుకుంది.