భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమదే అంటూ వితండవాదం చేస్తున్న చైనా.. మరోసారి అర్థంలేని వ్యాఖ్యలు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతం తమదే కాబట్టి.. అమిత్ షా పర్యటన తమ దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. 'జాంగ్నాన్ (అరుణాచల్‌కు చైనా పెట్టిన పేరు) చైనా భూభాగం కిందకు వస్తుంది. ఈ భూభాగంలో భారత అధికార వర్గాల కార్యకలాపాలు చైనా సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్నాయి. సరిహద్దులో శాంతి, సుస్థిరతలకు ఇది మంచిది కాదు. మేం దీన్ని వ్యతిరేకిస్తున్నాం' అంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ సోమవారం చెప్పుకొచ్చారు.
అమిత్ షా వార్నింగ్
సోమవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన అమిత్ షా.. దుందుడుకు చైనాకు పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించుకోవచ్చనే కాలం గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. భారత సరిహద్దుల వైపు ప్రత్యర్థులెవరూ కన్నెత్తి చూడలేరని అన్నారు. భారత్‌కు చెందిన అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని స్పష్టం చేశారు.
వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా సరిహద్దు గ్రామమైన కిబిథూను అమిత్ షా సందర్శించారు. మోదీ సర్కారు.. సరిహద్దు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. 1962 యుద్ధంలో అమరులైన జవానులకు అమిత్ షా నివాళులు అర్పించారు. సరైన వనరులు లేనప్పటికీ.. భారత జవాన్లు అద్భుతంగా పోరాడారని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజల వైఖరిని చూసి ప్రత్యర్థులు పారిపోయారని చైనాకు చురకలు అంటించారు.
"అరుణాచల్ ప్రదేశ్‌లో ఎవరూ నమస్తే అని పలకరించుకోరు. అందరూ జై హింద్ అనే పిలుచుకుంటారు. అది విన్నప్పుడల్లా గుండెల నిండా దేశభక్తి ఆవహిస్తుంది. అరుణాచల్ ప్రజలకు ఉన్న ఇలాంటి వైఖరే.. ఆక్రమించుకోవాలని భావించిన చైనాను పారిపోయేలా చేసింది. 2014కు ముందు ఈశాన్య ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా చూసేవారు. లుక్ ఈస్ట్ పాలసీ వల్ల ఇక్కడ అభివృద్ధి సాధ్యమైంది. సరిహద్దు ప్రాంతాలను ఎవరైనా సందర్శిస్తే.. దేశంలోని చిట్టచివరి గ్రామానికి వెళ్లి వచ్చామని గతంలో చెప్పుకునేవారు. కానీ, మోదీ సర్కారు ఆ భావనను మార్చేసింది. దేశంలోని మొట్టమొదటి గ్రామాలను సందర్శించామని చెప్పుకునేలా చేసింది."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఇదిలా ఉండగా, గతవారమే అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా భావిస్తున్న చైనా.. రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, ఐదు పర్వత శిఖరాలు, రెండు నదులకు పేర్లు పెడుతూ ప్రకటన చేసింది. దీన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఎన్ని పేర్లు పెట్టినంత మాత్రాన.. వాస్తవాలను మార్చలేరని చైనాకు చురకలు అంటించింది.