Child Kidnapping Delhi : దేశ రాజధాని దిల్లీలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక.. తాను రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని తల్లిదండ్రులతో మారాం చేసింది. దీంతో చేసేదేమీ ముద్దుల కుమార్తె కోరిక తీర్చేందుకు వారు ఓ నెల వయసున్న బాలుడ్ని కిడ్నాప్ చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే?
ఇదీ జరిగింది
ఠాగూర్ గార్డెన్‌లోని రఘుబీర్నగర్కు చెందిన సంజయ్ గుప్తా, అనితా గుప్తా దంపతులకు ఒక కుమార్తె ఉంది. వీరి కుమారుడు గతేడాది డాబా పైనుంచి కింద పడి మరణించాడు. అప్పటి నుంచి కూతురుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే వీరి కుమార్తె తాను రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని తల్లిదండ్రులతో మారాంకు దిగింది. ముద్దుల కూతురు కోరిక కాదనలేకపోయారు ఆ తల్లిదండ్రులు.
One Month Boy Kidnapping Delhi : చట్టా రైల్ చౌక్‌లోని ఫుట్‌పాత్‌పై దీపక్, రాంశీల దంపతులు తమ రెండేళ్ల కుమార్తె, నెల వయసున్న కుమారుడితో ఆగస్టు 23వ తేదీ రాత్రి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన సంజయ్ గుప్తా దంపతులు.. నెల వయసున్న బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆగస్టు 24న ఉదయం దీపక్ దంపతులు నిద్రలేచేసరికి తమ కుమారుడు కనిపించలేదు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ ఆచూకీ కనుక్కొవాలని పోలీసులను అభ్యర్థించారు. అప్రమత్తమైన పోలీసులు.. స్థానికంగా ఉన్న 400 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అనుమానంగా తిరుగుతూ కనిపించారు. ఆ బైక్.. సంజయ్ గుప్తా అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. వెంటనే నిందితుల కోసం 15 మంది పోలీసులు ఠాగూర్ గార్డెన్ వెళ్లారు. అక్కడ నిందితులు సంజయ్ గుప్తా దంపతులను శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నెల వయసు బాలుడ్ని స్వాధీనం చేసుకుని.. అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.
పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితులు పోలీసుల ఎదుట చేసిన నేరాన్ని అంగీకరించారు. తమ కుమారుడు గతేడాది డాబా పైనుంచి కింద పడి చనిపోయాడని చెప్పారు. రక్షా బంధన్ రోజు తన సోదరుడికి రాఖీ కట్టాలని తమ కూతురు డిమాండ్ చేస్తోందని.. అందుకే బాలుడ్ని కిడ్నాప్ చేశామని చెప్పారు.
కూతురికి పిల్లలు లేరని దారుణం.. 10 నెలల చిన్నారి కిడ్నాప్.. అడ్డొచ్చిన ఆమె తల్లిని..
బాస్ కుమారుడినే కిడ్నాప్ చేసి రూ. 50 లక్షలు కొట్టేశారు- చివరకు..