సీజేఐ జస్టిస్ బోబ్డే తో కలిసి పని చేసిన అనుబంధాన్ని తాను మరచిపోలేనని తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. జస్టిస్ బోబ్డే తెలివి, శక్తి సామర్థ్యాలు తనను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజేఐ జస్టిస్ బోబ్డే వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్‌వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తి సమయంలోనూ.. మౌలిక సదుపాయాల కల్పన కోసం జస్టిస్ బోబ్డే కృషి చేశారని కొనియాడారు.
"వీడ్కోలు పలకడం అనేది కష్టమైన పని. సీజేఐ జస్టిస్ బోబ్డే తో కలిసి పని చేసిన బంధాన్ని ఎప్పటికీ మరచిపోలేను. ఆయన తెలివి, శక్తి సామర్థ్యాలు నన్ను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటున్నాయి. మారుతున్న కాలం, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా న్యాయం అందించడం కోసం ఈ-కోర్టులను ఆయన ప్రారంభించారు. కరోనా వ్యాప్తి సమయంలోనూ మౌలిక సదుపాయల కల్పనకు ఆయన కృషి చేశారు. జస్టిస్ బోబ్డేకు ఉన్న విభిన్న అభిరుచులకు.. పదవీ విరమణ తర్వాత ఏం చేయాలో ఇప్పటికే నిర్ణయించుకుని ఉంటారు. ఆయన భవిష్యత్ అన్ని ప్రయత్నాల్లో మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను."
-తదుపరి సీజేఐ, జస్టిస్ ఎన్‌వీ రమణ.
క్రమశిక్షణతోనే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయగలమని తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలని కోరారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. వైరస్‌కు ఎలాంటి భేదభావాలు లేవన్న ఆయన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా కరోనా బారిన పడ్డారని గుర్తు చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండి అత్యవసర సేవలకు ఆటంకం కలిగించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలుగు బిడ్డకు సర్వోన్నత గౌరవం