ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయాన్ని (Puri Jagannath Temple) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI of India) జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించారు. సీజేఐకి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అంతటా కలియ తిరిగిన జస్టిస్ రమణ.. దేవాలయ విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ముక్తి మండపం, విమల ఆలయం, లక్ష్మీ కోవెల సహా ఇతర దేవాలయాలను జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana Latest News) సందర్శించారు.
"సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మేము స్వాగతం పలికాము. ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి. తొలిసారి 2020లో వచ్చారు. ఈసారీ కుటుంబంతో కలిసి వచ్చారు. దర్శనం బాగా జరిగింది. దేవతలను వారు దర్శించుకున్నారు. మాకు దక్షిణం ఇచ్చారు. మేము ఆశీర్వాదం ఇచ్చాము. ఆలయ వ్యవహారాలపై ఆయన కొన్ని సూచనలు చేశారు. మేము కూడా చెప్పాల్సింది చెప్పాము. చాలా సంతోషంగా తిరిగివెళ్లారు. జై జగన్నాథ్!"
--- ఆలయం అర్చకులు
ఒడిశా హైకోర్టు సీజే జస్టిస్ ఎస్ మురళీధర్, భారత పురాతత్వ శాఖ సూపరింటెండెంట్(ఒడిశా సర్కిల్) అరుణ్ కుమార్ మాలిక్‌తో పాటు సీనియర్ అధికారులు.. జస్టిస్ ఎన్.వి. రమణ వెంటే ఆలయానికి వెళ్లారు.
రెండు రోజుల ఒడిశా పర్యటనను ముగించుకుని.. శనివారం సాయంత్రం సీజేఐ దిల్లీకి తిరిగివెళ్లనున్నారు.
'ఆ అవసరం ఉంది..'
శాసనసభ చట్టాలను పునఃపరిశీలించి.. సమయానికి అనుగుణంగా, ప్రజల శ్రేయస్సుకు తగ్గట్టుగా వాటిని సంస్కరించాలని అభిప్రాయపడ్డారు జస్టిస్ ఎన్వీ రమణ. ఒడిశా లీగల్ సర్వీస్ అథారిటీ నూతన భవనాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు సీజేఐ.
రాజ్యాంగ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు శాసన వ్యవస్థ- న్యాయవ్యవస్థ కలిసిగట్టుగా పనిచేయాలన్నారు. అప్పుడే న్యాయవ్యవస్థ.. విధానకర్తల పాత్ర తీసుకోదని, కేవలం చట్టాల పరిరక్షణపైనే దృష్టిసారిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Delhi Court Shootout: కోర్టులో కాల్పుల ఘటనపై సీజేఐ విచారం