2020.. మనకు ఎన్నో నేర్పింది. కరోనా మహమ్మారితో నిత్య జీవితం చాలా మారింది. ఇంటి నుంచి పని.. ఆన్‌లైన్‌లో పాఠాలు.. క్లిక్ చేస్తే ఇంటి ముందుకొచ్చే నిత్యావసరాలు.. అయితే ఎన్ని మారినా 'బిర్యానీ' మీద భారతీయులకు ఉన్న ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. కరోనా కాలంలోనూ బిర్యానీని తెగ తినేశారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వార్షిక గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీ ఆర్డర్లు వచ్చాయట.
స్విగ్గీ ఇటీవల తన 5వ వార్షిక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ ఏడాది అత్యధిక ఆర్డర్లు వచ్చిన వంటకాల్లో బిర్యానీ రెండు సార్లు ఉండటం విశేషం. ఇందులో భారతీయుల ఫేవరెట్ డిష్‌గా చికెన్ బిర్యానీ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మసాలా దోశ, పనీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. వెజ్.. చికెన్.. మటన్.. ఆలూ.. ఇలా బిర్యానీ ఏదైనా ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయట. మరో విశేషమేంటంటే.. స్విగ్గీలో కొత్తగా చేరిన 3లక్షల మందికి పైగా యూజర్ల తొలి ఆర్డర్ కూడా చికెన్ బిర్యానీనే. ప్రతి ఒక వెజ్ బిర్యానీకి ఆరు చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. నగరాల వారీగా బెంగళూరు, ముంబయి, చెన్నై, హైదరాబాద్, దిల్లీ నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.
పానీపూరీకి భలే గిరాకీ..
కరోనా తొలినాళ్లలో స్ట్రీట్ ఫుడ్ పానీపూరీని చాలా మంది మిస్ అయ్యారు. అయితే ఫుడ్ డెలివరీ యాప్‌లు వీటిని కూడా డెలివరీ చేయడం మొదలుపెట్టిన తర్వాత పానీపూరీకి ఆన్‌లైన్ గిరాకీ విపరీతంగా పెరిగిందట. లాక్‌డౌన్ తర్వాత 2లక్షలకు పైగా పానీపూరీ ఆర్డర్లను డెలివరీ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇక వైరస్ వల్ల ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ కూడా పెరిగింది. అందుకే ప్రొటీన్లు అధికంగా ఉండే వంటకాలు, కీటో డైట్ పదార్థాలకు ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది.
ఇదీ చూడండి: మగువలు మెచ్చే.. వన్నెతగ్గని 'లక్కగాజులు'