రూ.96 వేల ఫోన్ కోసం ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని రిజర్వాయర్ నుంచి బయటకు తోడించారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్. అందుకు అధికారులు కూడా ఆయనకు సహకరించడం గమనార్హం. దాదాపు మొత్తం గ్రామ ప్రజల సాగు, తాగు నీరు అవసరాలను తీర్చే ఆ జలాశయంలో ఉన్న లక్షల లీటర్ల నీటిని తన స్వార్థం కోసం విడుదల చేయించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆ రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం భుపేశ్ బఘేల్ ప్రభుత్వాన్ని బీజేపీ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మూడు రోజులు కష్టపడి..
కాంకేర్ జిల్లాలోని కోయిలిబెడ బ్లాక్‌కు చెందిన ఫుడ్ ఆఫీసర్ రాజేశ్ విశ్వాస్ విహారయాత్ర కోసం సోమవారం ఖేర్‌కట్టా పర్‌కోట్ రిజర్వాయర్‌కు వెళ్లారు. అక్కడ ఆయన సరదాగా సెల్ఫీ దిగుతున్న సమయంలో సుమారు రూ.96 వేల రూపాయల విలువైన శామ్సంగ్ ఫోన్ రిజర్వాయర్‌లో పడిపోయింది. దీంతో తన ఫోన్‌ను ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలనే ఆశతో జలవనరుల శాఖ అధికారులకు ఫోన్ చేశారు.
వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం.. రిజర్వాయర్ నుంచి ఎలాగైనా నీటిని తోడించి ఫోన్‌ను అప్పజెప్తామని రాజేశ్‌కు హామీ ఇచ్చింది. కొంతసేపటికే హుటాహుటిన 30హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపులతో జలవనరుల శాఖ సిబ్బంది ఆ జలాశయం వద్దకు చేరుకుంది. అందులో ఉన్న నీటిని బయటకు పంపించే పనిని ప్రారంభించారు. మూడు రోజులు గడిచే సరికి సుమారు 21 లక్షల లీటర్ల నీటిని బయటకు వృథాగా పంపించారు. ఎట్టకేలకు గురువారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ విశ్వాస్‌కు చెందిన ఖరీదైన ఫోన్‌ను బయటకు తీయగలిగారు. అయినా ఆ ఫోన్ ఆన్ కాలేదు.
![Chhattisgarh food inspector pumped 21 lakh liters of water from reservoir to get out expensive phone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18600529_cg.jpg)
5 అడుగులు తోడమంటే.. 10 అడుగులు తీశారు!
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ ఫోన్ పడ్డ రిజర్వాయర్‌లో 15 అడుగుల మేర నీరు నిండి ఉంది. అయితే జలాశయం నుంచి నీటిని తోడి ఫోన్ బయటకు తీయమని ఆదేశించిన మాట వాస్తవేమనని అధికారులు చెప్పారు. అయితే కేవలం 5 అడుగుల నీరును మాత్రమే తీయమన్నామని.. కానీ సిబ్బంది మాత్రం 10 అడుగుల వరకు నీటిని తొలగించిందని జలవనరుల శాఖ ఎస్‌డీఓ రామ్ లాల్ ధివర్ తెలిపారు.
ప్రభుత్వం చుట్టూ వివాదం!
ఈ వ్యవహారం కాస్త అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటుకుంది. కేవలం రూ.96 వేల ఫోన్ కోసం నీటిని వృథా చేయిస్తారా అంటూ బీజేపీ సహా ప్రతిపక్షాలు.. బఘేల్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. సీఎం ఆధ్వర్యంలోని అధికారుల బృందం రాష్ట్రంలో నియంతృత్వ వైఖరిని సాగిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆ రాష్ట్ర మంత్రి అమర్జీత్ భగత్ విచారణ పూర్తయ్యాక బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.