Chennai Old Man Burnt Himself: తన ఇల్లు కూలగొడుతున్నారనే ఆవేదనతో 60 ఏళ్ల వృద్ధుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని రాజా అన్నామలైపురంలో జరిగింది. కూల్చివేతలకు నిరసనగా ఆ ప్రాంతానికి చెందిన కన్నయన్ అనే వ్యక్తి నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఆయనను రక్షించి కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా కూల్చివేత పనులను నిలిపివేశారు అధికారులు.

ఇదీ జరిగింది: కన్నయన్ అనే 60 ఏళ్ల వృద్ధుడు చెన్నై రాజా అన్నామలైపురం గోవిందసామి నగర్ ఇళంగో వీధిలో నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో చాలా మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో తమిళనాడు రెవెన్యూ, ప్రజాపనుల శాఖ గత వారంరోజులుగా అక్రమ నిర్మాణాలను తొలగించే పనిలో నిమగ్నమైంది. పోలీసుల సహాయంతో అక్రమాలను తొలగిస్తుండగా స్థానికులు తీవ్ర ఆందోళన చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కూల్చివేతలకు నిరసనగా కన్నయన్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. వెంటనే పోలీసులు కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం గాయలతో ఆస్పత్రిలో చేరిన కన్నయన్ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
ఇదీ చదవండి: షాహీన్బాగ్కు మళ్లీ బుల్డోజర్లు.. టెన్షన్ టెన్షన్