ఓ ఇంట్లో నిర్వహిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుల శరీరాలు ముక్కలు ముక్కలై.. చెల్లచెదురుగా పడ్డాయి. మరికొందరి శరీర భాగాలు శిథిలాల కిందే చిక్కుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. చాలా మంది కాళ్లు, చేతులు పొగొట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్నాహ్నం 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల మేర వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడుతో ఇంటి తలుపులు, కిటికీలు దూరంగా ఎగిరిపడ్డాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతానంతా చుట్టుముట్టాయి. ఘటన జరిగిన ఇల్లు జనవాసాలకు దూరంగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పినట్టైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహూటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
"ప్రమాదం గురించి పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 112కి కాల్ వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్నాం. అప్పటికే నలుగురు మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడే చెప్పలేము. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం." అని పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. శవపరీక్షల నిమ్మిత్తం వాటిని ఆసుపత్రికి తరలించినట్లు వారు వెల్లడించారు. ఘటన స్థలంలో ప్లాస్టిక్ డ్రమ్‌లను గుర్తించినట్లు పేర్కొన్నారు.
రాజ్ కుమార్ అనే వ్యక్తి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో కెమికల్ ఫ్యాక్టరి నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు వారు వెల్లడించారు. అతని సోదరుడుని మాత్రం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు స్నేహితులు మృతి..
హరియాణాలోని హిసార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నేరుగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురిలో.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు.
గురువారం రాత్రి ఈ ఘటన జరిగ్గా.. శుక్రవారం ఉదయం వరకు ఆ కారు అలాగే ఉంది. శుక్రవారం కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రకి తరలించారు. ఈ ఏడుగురు కలిసి స్నేహితుని పెళ్లికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.