Pakisthan MBBS Seats: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్‌లోని ఎంబీబీఎస్, ఉన్నత విద్య సీట్లను జమ్ము కశ్మీర్‌లో విక్రయిస్తూ ఆ నిధులను ఉగ్రకార్యకలాపాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ హురియత్ నేతతో పాటు ఎనిమిది మందిపై ప్రత్యేక కోర్టు సోమవారం అభియోగాలు మోపింది. హురియత్ నాయకుడు మహ్మద్ అక్బర్ భట్ అలియాస్ జఫర్ అక్బర్ భట్‌తో పాటు మరో ఏడుగురు వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినందుకు శ్రీనగర్‌లోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి మంజీత్ సింగ్ మన్హాస్ అభియోగాలు మోపారు.
జులై 27, 2020న రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఏ) వీరిపై కేసు నమోదు చేసింది. జమ్ము కశ్మీర్ నివాసితులకు వైద్య విద్య సహా ఇతర వృత్తిపరమైన కోర్సుల్లో ప్రవేశం కల్పించడం కోసం వారు కొన్ని విద్యా కన్సల్టెన్సీలతో చేతులు కలిపి సీట్లను విక్రయించినట్లు తెలిపింది.
"ఐదు నెలలపాటు సాగిన ఈ విచారణలో అన్ని విభాగాల అధికారుల వాదనలు విన్న తర్వాతే కోర్టు అభియోగాలు మోపింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్ల కోసం భారీ మొత్తంలో డబ్బులు వసూలు అయ్యాయి. అవి ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లాయి. కోర్టు అభియోగాలు మోపాక.. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించాం."
- ఎస్ఐఏ అధికారి
"సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఇతర అంశాలను విశ్లేషించగా, ఎంబీబీఎస్‌తోపాటు పాకిస్థాన్‌లోని పలు టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించినందుకు నిందితుల ఖాతాల్లో భారీగా సొమ్ము జమ చేసినట్లు తేలింది. సంపాదించిన డబ్బును ఉగ్రవాదులు.. గ్రౌండ్ వర్కర్లకు బదిలీ చేసినట్లు దర్యాప్తులో సరైన ఆధారాలతో బయటపడ్డాయి. విచారణలో సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేశాం. వివిధ కన్సల్టెన్సీల ద్వారా వృత్తిపరమైన కోర్సులు, ముఖ్యంగా ఎంబీబీఎస్ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను దరఖాస్తు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని దర్యాప్తులో మరింత తేలింది. చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలను కూడా ఏర్పాటు చేసి వారి పాకిస్థాన్ పర్యటనను సులభతరం చేసినట్లు తేలింది." అని ఎన్‌ఐఏ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: 'విదేశీ విరాళాల'పై సీబీఐ నజర్.. అదుపులో హోంశాఖ అధికారులు!