COMPENSATION FOR DOG DEATH: సుమారు 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయస్థానంలో విజయం సాధించాడు ఓ వ్యక్తి. ఓ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్న కుక్క... రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల దాని నుంచి వచ్చే ఆదాయాన్ని అతడు కోల్పోయాడు. దీంతో శునకం మరణానికి కారణం అయిన వారిపై కేసు పెట్టి కోర్టుకు వెళ్లాడు. సుమారు 8 ఏళ్ల 11 నెలల తరువాత పరిహారం పొందాడు.
అసలు ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలోని చంద్రాపుర్కు చెందిన ఉమేశ్ భత్కార్‌కు ఓ కుక్క ఉంది. దాని పేరు జాన్. ఆ శునకం ఓ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పని చేసేది. దీని ద్వారా యజమానికి నెలకు రూ. 8 వేలు వచ్చేవి. ఓ రోజు ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తుంటే స్థానికంగా ఉండే ఓ స్కూల్ బస్ ఆ శునకాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జాన్ అక్కడికక్కడే మరణించింది.
ఈ ఘటనపై ఉమేశ్.. పాఠశాల యాజమాన్యం, ట్రావెల్స్ కంపెనీ మీద కేసు పెట్టారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. వారు మిన్నుకుండి పోయారు. దీంతో ఆ శునకానికి చేసిన శవపరీక్షల నివేదికలను తీసుకుని చంద్రాపుర్‌లోని మోటార్ యాక్సిడెంట్స్ క్లైం ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. కుక్కను చంపిన కారణంగా తన జీవన భృతికి ఇబ్బంది కలిగిందని వారిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బజాజ్ అలయన్స్, ట్రావెల్ కంపెనీ ఓనర్, డ్రైవర్‌ను ఇందులో నిందితులుగా చేర్చాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు ద్వారా కోరాడు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం చివరకు ఉమేశ్ భత్కర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఇదీ చూడండి: కుక్క పేరు తెచ్చిన తంట.. మహిళ ఒంటికి నిప్పంటించి..