Chandrababu To Visit NTR Trust Bhavan : తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా నిలుస్తోందంటే.. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ వేసిన పునాదే కారణమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా తెలుగుదేశం ముద్ర ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ జాతీయ అధ్యక్షుడుగా నియమితులైందుకు చంద్రబాబును పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించి.. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
Chandrababu At NTR Trust Bhavan : రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ పని చేస్తోందని చంద్రబాబు వివరించారు. ప్రతి తెలుగువాడిని సంపన్నుడిగా చేయడమే టీడీపీ లక్ష్యమని పేర్కొన్నారు. తెలుగు జాతి ఎక్కడ ఉంటే.. అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. టీడీపీ వచ్చిన తర్వాతనే తెలుగు వారి ప్రతిభ.. ప్రపంచానికి చాటి చెప్పే పరిస్థితి వచ్చిందని ఆనందించారు. మరోసారి తనకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వివరించారు.
NTR Trust Bhavan In Hyderabad : తెలుగువారైన ఎన్టీఆర్, పీపీ నరసింహరావులు దేశానికి దశ దిశను చూపించారని కొనియాడారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధితో ముందుకు దూసుకెళుతోందని.. అందుకు నాడు వేసిన బాటనే కారణమని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇక్కడ టీడీపీను బలమైన పార్టీగా తయారు చేసేందుకు కార్యకర్తలు అందరూ సహకరించాలని కోరారు. మొన్నటి మహానాడుకు రాష్ట్రం నుంచి రాజమహేంద్రవరానికి భారీగానే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారని ఈ సందర్భంగా టీడీపీ అధినేత తెలియజేశారు.
తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తోందని అందులో ఎలాంటి సందేహం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో ఉన్నట్లే ఇక్కడ కూడా మళ్లీ.. పార్టీకి పూర్వ వైభవం వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా మీ ఉత్సాహం బాగుందని కొనియాడారు. ఇలానే ఉంటే భవిష్యత్ మనదే అని జోస్యం చెప్పారు.
"ఈరోజు దేశంలోనే తెలంగాణ ఇంతగా అభివృద్ధి సాధించి.. దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందంటే కారణం తెలుగుదేశం నాడు వేసిన పునాదినే కారణం. తెలంగాణలో ఉండే తెలుగువారి కోసం అందరం కలిసి పనిచేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో ఉండే తెలుగువారి కోసం పని చేయాలి. ప్రతి ఒక్క తెలుగువాడు సంపన్నుడుగా ఉండాలి. పేదవాడు కూడా సంపన్నుడుగా మారాలి. ఇదే తెలుగుదేశం పార్టీ సంకేతం." - నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకున్నామని.. వంద ప్రధాన నగరాల్లో వేడుకలు ఘనంగా జరిగాయని చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదే తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఆయన విచ్చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పూలమాలతో సత్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో చంద్రబాబు ఫొటోలు దిగారు.
ఇవీ చదవండి :