Chandrababu in NTR Centenary Celebrations: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులూ పాల్గొన్నారు. శతజయంతి వేడుకల సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై రెండు పుస్తకాలను ఈ సభలో విడుదల చేశారు. శత జయంతి సభలో రజనీకాంత్, బాలకృష్ణలకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. వీరితో పాటు లోకేశ్వరి, మోహనకృష్ణ, రామకృష్ణలకూ జ్ఞాపికలు అందించారు.
ఈ సభలో తెలుగుదేశం అధినేత ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ నటించిన విధంగా భవిష్యత్తులో సినిమాలలో ఎవరూ చేయలేరని రజనీకాంత్ అన్నారంటే ఎన్టీఆర్ ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి శాశ్వతంగా గుర్తుంచుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని.. దేశ రాజకీయాల్లో మార్పు తేవాలని సంకల్పించారని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించాలని అన్నారు. ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుందన్నారు.
ఒక నాయకుడు మరో నాయకుడిని ఎలా ప్రభావితం చేస్తారో రజనీ చెప్పారని.. రజనీకాంత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. భాషతో సంబంధం లేకుండా రజనీ చిత్రాలతో ఆదరించారని చంద్రబాబు అన్నారు. రజనీకాంత్‌కు జపాన్‌లో వీరాభిమానులు ఉన్నారని.. మంచి మానవత్వం ఉన్న వ్యక్తి రజనీకాంత్ అని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజనీని ఆహ్వానించినట్లు తెలిపారు. సినిమా చిత్రీకరణ రద్దు చేసుకుని రజనీకాంత్ ఉత్సవాలకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి తెలుగుజాతిలో శాశ్వతంగా ఉండాలని సూచించారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని.. భారతరత్న ఇచ్చేవరకు తెలుగుజాతి పోరాడాలని కోరారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి దిల్లీకి పంపనున్నట్లు వెల్లడించారు. సినీ, రాజకీయరంగాల్లో బాలకృష్ణ రాణిస్తున్నారని.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని సేవాభావంతో నడిపిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకటనారాయణ అని.. ఎన్టీఆర్‌పై తొలినాళ్లలో వెంకటనారాయణ పుస్తకం రాశారని వెల్లడించారు. ఎన్టీఆర్ గురించి దేశానికే కాదు ప్రపంచానికే వెంకటనారాయణ తెలియజెప్పారని అన్నారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ చరిత్ర సృష్టించబోయే యుగపురుషుడని చెప్పారని వివరించారు.
"భారతదేశం గర్వించదగిన వ్యక్తి నందమూరి తారకరామారావు. రజనీకాంత్‌లాంటి సూపర్ స్టార్ కూడా.. ఎన్టీఆర్ నటించినట్లు నటించలేను అన్నారంటే.. ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన యుగ పురుషుడు అయ్యాడు. ఎన్టీఆర్ శాశ్వతంగా గుర్తుంచుకునేలా మనం కార్యక్రమాలు చేయాలి." -చంద్రబాబు
ఇవీ చదవండి :