నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారడంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం.. రైతుల పట్ల పక్షపాతంగా వ్యవహరించటమే ఈ హింసకు కారణమన్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.
"దిల్లీలోని దృశ్యాలు నన్ను కలచివేశాయి. దీనికి కారణం.. రైతు సోదరులు, సోదరీమణుల పట్ల కేంద్రం పక్షపాతంగా వ్యవహరించటమే. రైతులను సంప్రదించకుండా చట్టాలను చేసింది కేంద్రమే. రైతులు రెండు నెలల నుంచి నిరసనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ భయానక చట్టాలను వెంటనే రద్దు చేయాలి."
--మమతా బెనర్జీ , బంగాల్ సీఎం.
దిల్లీలోని ఉద్రిక్తతలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రైతులని పట్టించుకోలేదని.. అందుకే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారన్నారు.
"రైతులు ఇంత కాలం శాంతియుతంగా నిరసనలు చేశారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. అందుకే రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతలను కట్టడి చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం రైతుల సమస్యలను పరిష్కరించాలి. ఈ రోజు ఆందోళన సాగిన విధానం చాలా బాధాకరం. రైతులు శాంతియుతంగా గ్రామాలకు వెళ్లండి. మిమ్మల్ని తప్పుబట్టే అవకాశం కేంద్రానికి ఇవ్వకండి."
--- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత.
స్టాలిన్ ఫైర్..
దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులపై లాఠీ ఛార్జ్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలను.. కేవలం కండితుడుపు చర్యగా అభివర్ణించారు.
బయటి శక్తులే
మంగళవారం జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో రైతులపై కేంద్రం వ్యవహరించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పశ్చాత్తాప పడాలంది. ర్యాలీలో విధ్వంసాన్ని.. బయటి వ్యక్తులే సృష్టించారన్న విషయం రైతులే తమకు తెలిపారని ఆప్ వివరించింది.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి.. అనుమతులిచ్చిన మార్గాన్ని వీడి ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో దిల్లీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇదీ చదవండి : దద్దరిల్లిన దిల్లీ- ఎర్రకోటపై 'రైతు' జెండా