Oxygen Steward: దేశంలో కరోనా రెండో దశ సమయంలో ప్రతి చోటా ఆస్పత్రుల్లో వినిపించిన మాట ఆక్సిజన్ కొరత. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూలైన్లలో నిల్చున్న దృశ్యాలు కనిపించాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి మొర పెట్టుకున్నాయి.
ఇప్పుడు మరోసారి ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఆక్సిజన్ స్టీవార్డ్'లను నియమించాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకరికి సంబంధిత శిక్షణ ఇచ్చే దిశగా ప్రణాళికలు చేసింది.
Oxygen Stewardship Program: నేషనల్ ఆక్సిజన్ స్టీవార్డ్‌షిప్ ప్రోగ్రామ్‌ను బుధవారం ప్రారంభించారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డా. భారతీ ప్రవీణ్ పవార్. ఈ కార్యక్రమంతో ఆరోగ్య సిబ్బంది నైపుణ్యాలు మెరుగుపడతాయని, ఆక్సిజన్ కొరత తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు.
"ఆక్సిజన్ ప్రాణాలను కాపాడుతుంది. కొవిడ్-19 మాత్రమే కాకుండా ఎన్నో వ్యాధుల చికిత్సలో ఇది కీలకం. మహమ్మారి సమయంలో పెరిగిన ఆక్సిజన్ డిమాండ్‌ను దేశం చూసింది. అందువల్ల, ఆక్సిజన్‌ను హేతుబద్ధంగా ఉపయోగించడం తప్పనిసరి.''
- డా. భారతీ ప్రవీణ్ పవార్, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
Utilisation and Reducing Oxygen Wastage: ఆక్సిజన్ నిర్వహణలో నిమగ్నమై ఉన్న ఆస్పత్రి యాజమాన్యానికి, ఆరోగ్య సిబ్బందికి ప్రాణవాయువు వినియోగానికి సంబంధించి అవగాహన కల్పించడం సహా మెడికల్ ఆక్సిజన్ వృథాను నివారించే దిశగా ఈ స్టీవార్డ్‌లు సాధికారత కల్పించాల్సి ఉంటుంది.
శిక్షణ పొందిన వ్యక్తులు ఆయా జిల్లాలకు సంబంధించి ఆక్సిజన్ థెరపీ, నిర్వహణను ముందుండి చూసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
Omicron in India: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరగుతున్నాయి. ఇప్పటివరకు 200పైనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 65 మందికిపైగా ఒమిక్రాన్ సోకింది. జమ్ముకశ్మీర్, ఒడిశాల్లోనూ మంగళవారం ఈ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దిల్లీ, తెలంగాణలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి కలవరపెడుతోంది.
ఈ వైరస్ నివారణ దిశగా ఇప్పటికే ఆయా రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి.
Karnataka Omicron Restrictions: కర్ణాటక ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ కనీసం మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. అందువల్ల మరింత దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖలు రాశారు. ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేయాలన్నారు.
ఇవీ చూడండి: India Corona cases: 575 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు