ETV Bharat / bharat

దేశద్రోహం చట్టం అమలు నిలిపివేత.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం - రాజద్రోహం చట్టంపై స్టే

sedition cases: దేశద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తైయ్యే వరకు ఈ సెక్షన్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని సీజేఐ జస్టిస్‌ ఎన్​వీ రమణ స్పష్టం చేశారు.

Centre to SC on pending sedition cases
సుప్రీం కోర్టు
author img

By

Published : May 11, 2022, 11:32 AM IST

Updated : May 12, 2022, 7:04 AM IST

sedition cases: అత్యంత వివాదాస్పదమైన రాజద్రోహ చట్టంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నేరారోపణతో జైళ్లలో మగ్గుతున్న వారికి ఊరటను కల్పించింది. విచక్షణారహితంగా నమోదవుతున్న కేసులకు ముకుతాడు బిగించింది.
భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 124ఎ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు దాని అమలును నిలిపేస్తూ కీలకమైన ఆదేశాలిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిల నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజద్రోహ చట్ట రాజ్యాంగబద్ధత అంశం ప్రభుత్వ పునఃపరిశీలనలో ఉన్నందున దీని కింద కొత్తగా కేసులు నమోదు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద నమోదైన అన్ని కేసులు, అప్పీళ్లు, ప్రొసీడింగ్స్‌నూ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఎవరిపైనైనా ఈ సెక్షన్‌తో పాటు, ఇతర సెక్షన్ల కిందా కేసులు నమోదు చేసి ఉంటే మిగిలిన సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. రాజద్రోహ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జులై మూడో వారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని అన్ని విపక్ష పార్టీలు, ఎడిటర్స్‌ గిల్డ్‌ స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు తమ పరిధులను అతిక్రమించరాదంటూ ‘లక్ష్మణ రేఖ’ను ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం సెక్షన్‌ 124ఎ నిబంధనపై పునఃసమీక్షకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పుడో బ్రిటిష్‌ పాలకుల హయాంలో అమల్లోకి తెచ్చిన ఈ సెక్షన్‌ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని, అందువల్ల దీన్ని పునఃపరిశీలించాలన్న కోర్టు సూచనను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలుచేసిన నేపథ్యంలో ధర్మాసనం నిర్ణయం వెలువడింది.

" ఒకవైపు రాజ్యం విధులు.. మరోవైపు ప్రజలకున్న పౌరహక్కులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొంది. ఈ రెండింటి మధ్య సమతౌల్యత పాటించాల్సిన అవసరం ఉంది. 1890నాటి సెక్షన్‌ 124ఎను ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నారనేది పిటిషనర్‌ ప్రధాన వాదన. హనుమాన్‌ చాలీసా పఠించడానికి ప్రయత్నించినా రాజద్రోహం కింద కేసులు నమోదుచేసి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు అటార్నీ జనరల్‌ కూడా చెప్పారు."

-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

  • ధర్మాసనం ఆదేశాల్లోని కీలకాంశాలు..
    రాజద్రోహ చట్టం (సెడిషన్‌ లా) పునఃపరిశీలనలో ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో, దర్యాప్తును కొనసాగించడంలో, బలవంతపు చర్యలు తీసుకోవడంలో సంయమనం పాటిస్తాయని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సమీక్ష పూర్తయ్యేంత వరకూ చట్టంలోని ఈ సెక్షన్‌ను ఉపయోగించడం సరికాదని తెలిపింది.
  • రాజద్రోహం కేసులకు సంబంధించిన పెండింగ్‌ విచారణలు, అప్పీళ్లు, అభియోగాల నమోదు ప్రక్రియను నిలుపుదల చేయాలి. ఒకవేళ సెక్షన్‌ 124ఎతో పాటు ఇతరత్రా నిబంధన కింద కేసు నమోదు చేసి ఉంటే కోర్టుల అనుమతి మేరకు ఆ సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చు.
  • ఈ సూచనలకు తోడు, సెక్షన్‌ 124ఎను దుర్వినియోగం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఇంకా ఏదైనా నిర్దేశాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు.
  • ఇప్పటికే ఈ సెక్షన్‌ కింద కేసులు ఎదుర్కొంటూ జైళ్లలో ఉన్నవారు బెయిల్‌ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు. ఎవరి మీదైనా తాజాగా కేసులు నమోదు చేసి ఉంటే బాధితులు కోర్టులను ఆశ్రయించి తగిన ఉపశమనం పొందడానికీ స్వేచ్ఛనిచ్చింది.
  • సెక్షన్‌ 124ఎ అమలును నిలిపివేస్తున్నందున కింది స్థాయి కోర్టులూ కక్షిదారులకు ఉపశమనం ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని సూచించింది.
  • సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎఫ్‌ఐఆర్‌ల పరిశీలనను ఎస్పీలకు అప్పగించడానికి తిరస్కరణ
ధర్మాసనం ఆదేశాలు వెలువరించడానికి ముందు కొద్ది సమయంపాటు వాదనలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యే వరకూ రాజద్రోహం నిబంధన అమలును నిలిపివేసే విషయమై కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమేమిటో తెలుసుకుని చెబుతానని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం అంగీకరించి విచారణను ఒక రోజు వాయిదా వేసిన విషయం తెలిసిందే. బుధవారం సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ రాజద్రోహ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలపై కేసులు నమోదు చేయకుండా నిరోధించడం న్యాయస్థానాలకు భావ్యం కాదన్నారు. అయితే, దుర్వినియోగాన్ని నివారించడం కోసం రాష్ట్రాలకు పంపించేందుకు ఒక ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం తయారు చేసిందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందే కేసును పరిశీలించే బాధ్యతను ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించేలా ముసాయిదాలో పొందుపరిచినట్లు సొలిసిటర్‌ జనరల్‌ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న రాజద్రోహం కేసుల్లో ఉగ్రవాదం, మనీలాండరింగ్‌ అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. పెండింగ్‌ కేసులను అంతిమంగా తేల్చే న్యాయస్థానాలను విశ్వసించాలని పేర్కొన్నారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు కేసును ఎస్పీ స్థాయి అధికారి పరిశీలించడాన్ని నిష్పాక్షిక చర్యగా భావించాలా? అని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లను ఎస్పీ స్థాయి అధికారి పరిశీలిస్తారన్న ప్రతిపాదనను ధర్మాసనం తిరస్కరించింది. ఆ తర్వాత న్యాయమూర్తులు వ్యక్తిగతంగా చర్చించుకున్నారు. ప్రస్తుతం సెక్షన్‌124ఎ కింద కేసులు నమోదైన వారు ఎంతమంది జైళ్లలో ఉన్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సుమారు 13వేల మంది ఉన్నట్లు పిటిషన్ల తరఫు న్యాయవాది కపిల్‌సిబల్‌ బదులిచ్చారు. తర్వాత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పందిస్తూ దీనికి సంబంధించిన అన్ని అంశాలపై ధర్మాసనం విస్తృతంగా చర్చించిందని, సెక్షన్‌124ఎలోని నిబంధనలు ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేవని కోర్టు వ్యక్తంచేసిన ప్రాథమిక అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏకీభవించిందని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టులో సవాల్‌ చేసింది వీరే..
ఎడిటర్స్‌ గిల్డ్‌, మేజర్‌ జనరల్‌(రిటైర్డ్‌) ఎస్‌.జి.వొంబత్కెరె, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరి, పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్‌).

కపిల్‌ సిబల్‌ ఉద్విగ్న స్పందన
సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్‌సిబల్‌ ఉద్విగ్నంగా స్పందించారు. ఈ అంశంపై కోర్టులో న్యాయం జరుగుతుందని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, అది ఇప్పుడు నిజమైందని సహచర న్యాయవాదులతో పేర్కొన్నారు. కోర్టులంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే సంస్థలని మరోసారి నిరూపితమైందని వ్యాఖ్యానించారు.

రాజద్రోహం కేసుల బాధితుల్లో ప్రముఖులు..
భారత శిక్షా స్మృతి 124ఎ అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో...ఈ నిబంధన కింద నమోదైన కేసులు చర్చనీయాంశమయ్యాయి. జాతీయ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బి) నివేదిక ప్రకారం ఈ నేరం కింద 2015-2020 మధ్య కాలంలో మొత్తం 356 కేసులు దాఖలయ్యాయి. 548 మంది వ్యక్తులు అరెస్టయ్యారు. వీరిలో ఆరుగురిపైనే నేరాలు నిరూపితమై శిక్షలు పడ్డాయి. రాజద్రోహం కేసులు నమోదైన వారిలో.. బెంగుళూరుకు చెందిన దిశారవి(టూల్‌ కిట్‌ కేసు), దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌, అనిర్భన్‌ భట్టాచార్య, దివంగత పాత్రికేయుడు వినోద్‌ దువా, కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్‌, బుకర్‌ ప్రైజ్‌ విజేత, రచయిత్రి అరుంధతి రాయ్‌, హార్దిక్‌ పటేల్‌(గుజరాత్‌), అసీమ్‌ త్రివేది(కార్టూనిస్ట్‌, కాన్పుర్‌), వినాయక్‌సేన్‌( పిల్లల వైద్యుడు, ఛత్తీస్‌గఢ్‌), సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌(పంజాబ్‌) తదితరులు ఉన్నారు.

రాష్ట్రంలో ఆరేళ్లలో అయిదు కేసులు
ఐపీసీ 124ఏ సెక్షన్‌ (రాజద్రోహం) కింద రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో అయిదు కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. 2014 ఆగస్టులో హైదరాబాద్‌ మాదన్నపేట పోలీసులు ఓ ఎంపీపై ఇదే సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. దిల్లీ జేఎన్‌యూలో వివాదస్పద నినాదాలు చోటు చేసుకున్న ర్యాలీలో పాల్గొన్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై రాహుల్‌గాంధీ, సీతారాం ఏచూరి, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులపై సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ములుగు కుట్ర కేసులో 54 మందిపై..
మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణంతో 2016లో 54 మందిపై సిద్దిపేట జిల్లా ములుగు కుట్ర కేసు నమోదు చేశారు. ఇదే కేసులో 33వ నిందితుడిగా ఉన్న టీపీఎఫ్‌ నేత నలమాసు కృష్ణపై వేర్వేరు ఉదంతాల్లో మరో 8 ఉపా కేసులు నమోదు చేయడం గమనార్హం. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో కృష్ణ మాట్లాడుతూ.. ‘124ఏ సెక్షన్‌తో పాటు ఉపా చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను దెబ్బతీసేందుకు వినియోగిస్తున్నారు. నాపై రాజద్రోహం, ఉపా కేసులు ప్రయోగించి దాదాపు ఏడాదిపైగా జైల్లో ఉంచారు. హక్కులు నిజమైన అర్థంలో అమలు కావాలంటే రాజద్రోహంపై సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి ఉపా చట్టంపై కూడా తీసుకోవాలి’ అన్నారు. ఇలా మొత్తంగా రాజద్రోహం కింద 2016లో 2, 2019లో1, 2020లో2 కేసులు నమోదయ్యాయి.

నిరంకుశ పాలకులకు విస్పష్ట సందేశం: కాంగ్రెస్‌
రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయడం ద్వారా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
నిజాల గొంతును నొక్కివేయడం ఎల్లకాలం సాధ్యపడదనే సందేశం.. అసమ్మతిని, విమర్శకులను, ప్రజాభిప్రాయాన్ని అణచివేయటానికి ప్రయత్నించే వారికి నేడు స్పష్టంగా వెళ్లింది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే వారి మాటలను ఆలకించాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. వాస్తవాలు మాట్లాడడం రాజద్రోహం కాదు..దేశభక్తి. నిజాలను వినడం రాజధర్మం..వాటిని అణచివేయడం దురహంకారం.

ఆ చట్టాన్ని రద్దు చేయాలి: సీపీఎం
స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయడానికి బ్రిటిష్‌ పాలకులు తీసుకొచ్చిన రాజద్రోహ చట్టానికి ఎప్పుడో కాలదోషం పట్టింది. స్వతంత్ర భారత దేశ చట్టాల్లో దానికి చోటివ్వకూడదు. భారతీయ శిక్షా స్మృతిలోని 124ఎ అమలును సుప్రీంకోర్టు నిలిపివేయడం శుభ పరిణామం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ చట్టం దుర్వినియోగం పెరిగిపోయింది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలి.

రద్దుకు ఎప్పటి నుంచోడిమాండ్‌ చేస్తున్నాం: సీపీఐ
ఐపీసీ సెక్షన్‌ 124ఎ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా 2011లోనే రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. ఈ చట్ట నిబంధనలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి. నియంతృత్వ పాలనకు మద్దతిచ్చేవి. సుప్రీంకోర్టు ఆదేశాలు సీపీఐ వైఖరిని సమర్థించేలా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ సానుకూల సూచనల వల్లే..: భాజపా
రాజద్రోహ చట్టం అమలు నిలిపివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం చేసిన సానుకూల సూచనల కోణంలో చూడాలి. ప్రభుత్వ సిఫార్సులను న్యాయస్థానం ఆమోదించింది. కాలం చెల్లిన 1500 చట్టాలను ప్రధాని మోదీ ప్రభుత్వం తొలగించింది.

లక్ష్మణ రేఖను దాటొద్దు: కేంద్ర న్యాయశాఖ మంత్రి
'శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు అన్నిటినీ ప్రభుత్వం గౌరవిస్తుంది. ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థను కోర్టులు గౌరవించాలి. అదే విధంగా ఇతర వ్యవస్థలూ ఉండాలి. ఈ వ్యవస్థలన్నిటి మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఆ లక్ష్మణ రేఖను ఎవరూ అతిక్రమించకూడదు' అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత విలేకరుల ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.

ఇదీ చూడండి: మంత్రి కోడలు ఆత్మహత్య! ఆ వ్యవహారమే కారణం!!

Last Updated : May 12, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.