దిల్లీలో కరోనా రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు.. చికిత్స అందిస్తున్న తీరును పరిశీలించేందుకు 10 బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం. దిల్లీ ప్రభుత్వం, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా ఆసుపత్రులు చర్యలు చేపడుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఈ మల్టీ-డిసిప్లీనరీ బృందాలు తనిఖీలు చేస్తాయి.
కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం.. ఈ మల్టీ-డిసిప్లీనరీ బృందాలు ప్రైవేటు ఆసుపత్రులను తక్షణమే సందర్శిస్తాయి. రెండు రోజుల్లో రిపోర్టును కేంద్రానికి అందిస్తాయి.
దిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే డిసిప్లీనరీ బృందాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మరో బృందాన్ని అదనంగా ఏర్పాటు చేసి రిజర్వులో పెట్టారు.
ఈ బృందాలు మొత్తం 114 ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి కరోనా రోగుల చికిత్సపై రిపోర్టును అందించనున్నాయి. కరోనా డాష్బోర్డుల్లో ఐసీయూ బెడ్ల అందుబాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించడం, కొవిడ్-19 డిశ్ఛార్జ్ విధానాలను పాటించడం, ఆర్టీ-పీసీఆర్ పరీక్షల నిర్వహణ తదితర ప్రభుత్వ మార్గదర్శకాల అమలును ఈ బృందాలు పరిశీలించనున్నాయి.
ఇదీ చూడండి:- దిల్లీలో ఒక్క రోజే 1400 చలాన్లు జారీ