సెంట్రల్ విస్టా(Central vista) ప్రాజెక్టులో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న ఉపరాష్ట్రపతి అధికారిక భవనానికి అడ్డంకులు తొలగాయి. భవన నిర్మాణ ప్రాంతాన్ని ఎందుకు మార్చారని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు స్పష్టం చేసింది. సంబంధిత అధికారులు.. సరైన వివరణ ఇచ్చారని వెల్లడించింది.
''ఈ అంశాన్ని పరిశీలించేందుకు తగిన కారణం ఏమీ కనిపించడం లేదు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లలేం. ఇక వివాదానికి స్వస్తి పలకండి.''
- సుప్రీం ధర్మాసనం.
తొలుత అనుకున్న ప్రదేశంలో కాకుండా.. ఉపరాష్ట్రపతి నివాస ప్రాంతాన్ని వేరే చోటుకు తరలించడంపై గతంలో పిటిషన్ దాఖలైంది.
త్రిభుజాకారంలో కొత్త భవనం..
సెంట్రల్ విస్టా(Central vista Pproject) ఆధునికీకరణ ప్రాజెక్టును 2019 సెప్టెంబర్లో ప్రకటించింది కేంద్రం.
ఇందులో భాగంగా.. ఒకేసారి 900 నుంచి 1200 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా త్రిభుజాకారంలో కొత్త పార్లమెంటును నిర్మిస్తున్నారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా ఇది నిర్మితం కానుంది. రూ.971 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం.. గుత్తేదారు సంస్థకు లక్ష్యం నిర్దేశించింది.
అవసరమైతే.. 2022 గణతంత్ర వేడుకలు కొత్త భవనంలోనే జరపాలని కేంద్రం యోచిస్తోంది.
ఇదీ చూడండి: సెంట్రల్ విస్టాలో మూడు సొరంగ మార్గాలు