సెంట్రల్ విస్టా(Central Vista) ప్రాజెక్టు కొనసాగించవచ్చంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని దిల్లీ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడాన్ని తప్పుబడుతూ అడ్వొకేట్ ప్రదీప్ కుమార్ యాదవ్.... సుప్రీంను ఆశ్రయించారు.
నిరూపిత ఆధారాలు లేనప్పుడు హైకోర్టు ఊహాజనితంగా ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. కరోనా సమయంలో భారీ స్థాయిలో కార్మికులు, సిబ్బంది పాల్గొనే నిర్మాణాలను అనుమతించడాన్ని తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు. దీన్ని గుర్తించడంలో హైకోర్టు విఫలమైందని ఆరోపించారు. హైకోర్టు ప్రతివాదుల్లో ప్రదీప్ కుమార్ లేకపోవడం గమనార్హం.
సెంట్రల్ విస్టాపై మే 31న తీర్పు వెలువరించింది దిల్లీ హైకోర్టు. తప్పుడు ఉద్దేశాలతో పిటిషన్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. పిటిషనర్లకు రూ. లక్ష జరిమానా విధించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులోని సెంట్రల్ విస్టా అవెన్యూ నిర్మాణాలను ఆపాలని వ్యాజ్యంలో పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే, ఇది ప్రాముఖ్యం ఉన్న ప్రాజెక్టు అని.. దీని నిర్మాణాన్ని నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి- పవార్- ఫడణవీస్ భేటీపై శివసేన కీలక వ్యాఖ్యలు