central serious on factors for the riots: మహమ్మద్ ప్రవక్తపై భాజపా నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం ఇటీవల దేశంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న అల్లర్లపై చర్యలు మొదలయ్యాయి. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పోలీసులు పలువురిని అదుపులో తీసుకున్నారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అనుమతి తీసుకోకుండా దిల్లీలోని జామా మసీదు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడంతోపాటు మత సామరస్యతకు విఘాతం కల్పించారనే కారణంపై నదీం జైద్, ఫహీం ఖాన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరింతమందిపై చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.
అల్లర్ల ఘటనల్ని రికార్డు చేసినవారి నుంచి వీడియోలు, చిత్రాలను సేకరించే పనిలో వారు నిమగ్నమయ్యారు. ‘శుక్రవారం జామా మసీదు వద్దకు దాదాపు 1,500 మంది వచ్చారు. ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాక వారిలో కొందరు బయటకు వచ్చి నినాదాలిచ్చారు. తర్వాత అల్లర్లు మొదలుకాగా పావుగంటలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చాం’ అని పోలీసులు తెలిపారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా 31 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిరసనకారులెవరనేది ఎవరికీ తెలియదని, వారిపై చర్యలు తీసుకోవాలని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి చెప్పారు.
ఆ ఇద్దరికీ పోలీసు తాఖీదులు: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ సోమవారం తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలని మహారాష్ట్రలోని ఠాణె జిల్లా భివండీ పోలీసులు సమన్లు జారీ చేశారు. వివాదాస్పద ట్వీట్ల విషయంలో ఈ నెల 15న హాజరు కావాలని నవీన్‌కుమార్ జిందాల్‌కు సమన్లు ఇచ్చారు. ఈ నెల 25న రావాల్సిందిగా ముంబయి పోలీసులు, 22న రావాలని ముంబ్రా పోలీసులు ఇదివరకే శర్మకు సమన్లు ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఉద్రిక్తంగా మారిన హావ్‌డా, ముర్షీదాబాద్ జిల్లాల్లో (పశ్చిమ బెంగాల్) ఆదివారం ప్రశాంతత నెలకొంది. ఈ రెండు జిల్లాల్లో వందమందికి పైగా అరెస్టయ్యారు. భద్రత బలగాలు కవాతు నిర్వహించాయి. దుకాణాలను, మార్కెట్లను తెరవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. రైళ్లు మామూలుగానే నడుస్తున్నాయి. నదియా జిల్లాలోని బెథుయాదాహరి రైల్వేస్టేషన్ వద్ద లోకల్ రైలుపై కొంతమంది ప్రజలు దాడి చేశారు. రైల్వేస్టేషన్లోకి చొరబడి రాళ్లు విసిరారు.
కోర్టుకు వెళ్తానన్న సువేందు: నిషేధాజ్ఞలు ఉన్న కారణంగా హావ్‌డా జిల్లాలో పర్యటించవద్దని ప్రతిపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడంపై తూర్పు మేడినిపుర్‌లోని తమ్లుక్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాహనం దిగనివ్వకుండా, భోజనానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై సోమవారం కోర్టుకు వెళ్తానని సువేందు ట్విటర్ ద్వారా చెప్పారు.
ప్రధాన నిందితుడి ఇల్లు కూల్చివేత : ప్రయాగ్‌రాజ్ హింసాత్మక ఘటనల వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జావేద్ అహ్మద్ నివాసాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ స్థానిక అధికారులు ఆదివారం దానిని కూల్చివేశారు. అనుమతి తీసుకోకుండా నిర్మించడంపై మే 10నే నోటీసు ఇచ్చి, రెండువారాల సమయం ఇచ్చామనీ, గడువులోగా ఎలాంటి పత్రాలు సమర్పించకపోవడంతో కూల్చివేత చర్యలు చేపట్టామనీ అధికారులు తెలిపారు.
రాంచీలో భద్రత పెంపు : ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం ఉద్రిక్తత కొనసాగడంతో భద్రతను పెంచారు. అల్లర్లకు సంబంధించి వేలమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సున్నితమైన చోట్ల భద్రత పెంచారు. శుక్రవారం నిరసనల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు అసలు ఆ ప్రదర్శనలోనే పాల్గొనలేదని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. యూపీలోని 8 జిల్లాల్లో ఇంతవరకు అరెస్టయిన వారి సంఖ్య 304కి చేరింది.
ఇదీ చదవండి: లోకల్ ట్రైన్‌పై నిరసనకారుల రాళ్ల దాడి.. పలువురికి గాయాలు