CENTRAL GOVT LETTER TO SC ON POLAVARAM : పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. విచారణ వాయిదా కోరుతూ లేఖ సమర్పించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ముంపు తలెత్తుతున్నందున దానికి పరిష్కార మార్గాలు చూపాలని ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం మరోసారి విచారణకు రానున్న క్రమంలో సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ రాసింది. సీఎంలు, జలశక్తి మంత్రి సమావేశం సంప్రదింపుల స్థాయిలోనే ఉందన్నకేంద్ర జల్‌శక్తి శాఖ.. 3 నెలల సమయం ఇవ్వాలని కోరింది.
గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. కసరత్తు జరుగుతోందని, తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం అవసరమని పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. పొరుగు రాష్ట్రాల్లో ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, భాగస్వాములతో సమావేశం నిర్వహించాలని, అవసరమైతే ప్రభావిత రాష్ట్రాల సీఎంలు కూర్చొని మిగిలిపోయిన సమస్యలు పరిష్కరించుకోవాలని 2022 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుది నివేదిక అందించడానికి మూడు నెలల సమయం కావాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానానికి కేంద్రం లేఖ సమర్పించింది.
సీపీఐ రాష్ట్ర వ్యాప్త నిరసనలు: పోలవరం ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తు కన్నా నిర్మాణాన్ని తగ్గించినా.. నీటి నిల్వలో మార్పులు చేసినా తీవ్ర స్థాయి ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని ఇప్పటికే పలు ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే పోలవరం ప్రయోజనాలను కాపాడాలని ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని సీపీఐ స్పష్టం చేసింది. తాజాగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు నిర్వహించారు. పోలవరం ఎత్తు తగ్గించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రారంభించారు. కేసుల విషయంలో ఉన్న శ్రద్ధ ప్రజాప్రయోజనాలపై సీఎంకు లేదని సీపీఐ ఆగ్రహించింది. కృష్ణా డెల్టాకూ అనుసంధానం ద్వారా వేల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: