కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను అందుకోవడానికి షరతుల మోతాదును కేంద్రం పెంచడం రాష్ట్రాల బడ్జెట్‌లపై ప్రభావం చూపనుంది. ఇకపై ఆ నిధులను తమ ఖాతాల్లో జమచేసుకోవడానికి, ఇతర అవసరాలకు మళ్లించుకోవడానికి రాష్ట్రాలకు వెసులుబాట్లు ఉండవు. ఇలాంటి చర్యలకు కళ్లెం వేస్తూ కేంద్రం కఠిన ఆంక్షలు పెట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును కేంద్రం మార్చింది. రాష్ట్రాల్లో జులై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఈ పథకాలన్నింటినీ నాలుగు విడతలుగా విభజిస్తుంది.
మొదటి విడతలో విడుదలైన 25 శాతం నిధుల్లో 75% ఖర్చుచేస్తేనే రెండో విడత సొమ్మును విడుదల చేస్తుంది. అవినీతికి తావులేని విధంగా ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇకపై ప్రతి కేంద్ర ప్రాయోజిత పథకానికీ వేర్వేరుగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాలను రాష్ట్రాలు తెరవాల్సి ఉంటుంది. ఆ ఖాతా ద్వారానే నిధులు అందుతాయి. ఆ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను, వస్తున్న ఫలితాలను కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక నోడల్ ఏజెన్సీలను ఏర్పాటుచేస్తోంది. అందువల్ల ఆ పథకాల నిధులను అందుకోవడానికి రాష్ట్రాలు మునుపటి కంటే ఎక్కువ షరతులు అమలుచేయాలి.
- ప్రస్తుతం అమలవుతున్న 57 కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటికీ ఈ మార్పులు వర్తిస్తాయి. ఒకవేళ ఏదైనా ఒక పథకంలో అంతర్భాగంగా వేర్వేరు పథకాలు అమలవుతుంటే, వాటికోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నోడల్ ఏజెన్సీలు ఏర్పాటు చేసి నిర్వహించాలి. పథకం అమలు చేసేవారికి నిధులను ఆ ఏజెన్సీల ద్వారానే అందించాలి. వాటి పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీకిగాను ఆ ఏజెన్సీల ఖాతాకు కేంద్ర నిధులు నేరుగా జమ అవుతాయి.
- ఒక పథకంతో ముడిపడిన ప్రధాన ఖాతా, దాని అనుబంధ ఖాతాలన్నీ ఒకే బ్యాంకులో ఉండాలి. క్షేత్రస్థాయి వరకు విస్తృత నెట్‌వర్క్, ఆన్‌లైన్ సౌకర్యం ఉన్న బ్యాంకుల్లోనే ఈ ఖాతాలు తెరవాలి.
- ఈ బ్యాంకు ఖాతాల్లో రాష్ట్రాల నుంచి మ్యాచింగ్ గ్రాంట్ జమ అయినప్పుడే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు జమ అవుతాయి.
- ఏదైనా పథకం కింద నిధులు ఖర్చు కాకపోతే అందుకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. ఈ పథకాల వ్యయం గురించి ప్రతినెలా ఆయా మంత్రిత్వశాఖలు సమీక్షించి, కేంద్రానికి నివేదిక పంపాలి.
ఇదీ చదవండి : వాట్సాప్లో దినపత్రికలు షేర్ చేస్తే అంతే!