కరోనా కారణంగా గత అక్టోబర్ 4న నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసు ప్రాథమిక పరీక్షకు గైర్హాజరైన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరోసారి పరీక్ష నిర్వహించలేమని ధర్మాసనానికి కేంద్రం విన్నవించింది. పిటిషనర్లకు ఉపశమనం కలిగిస్తే భవిష్యత్తులో ఇతర అభ్యర్థులపై పక్షపాతం చూపించినట్టవుతుందని పేర్కొంది. కొంతమంది అభ్యర్థులకు అదనపు ప్రయత్నం, సడలింపునివ్వడం వంటి చర్యలు ఇతర ఆశావాహుల అవకాశాలను దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
ప్రభుత్వ పనితీరు ప్రభావితం: కేంద్రం
ప్రజా పరీక్షల విభాగ పనితీరును ఈ చర్య తీవ్ర ప్రభావితం చేస్తుందని అందువల్ల ప్రస్తుత పిటిషనర్లకు అవకాశం కల్పించడం కుదరదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం కార్యదర్శి సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. కాగా, ఈ అంశంపై విచారణకు జనవరి 28కి వాయిదా వేసింది సుప్రీం.
ఇదీ చదవండి: సివిల్స్ అభ్యర్థులకు మరో ఛాన్స్‌పై సుప్రీం విచారణ