ఉరీ....! జమ్ముకశ్మీర్‌లోని ఈ ప్రాంతం కొంతకాలం క్రితం వరకూ ఉద్రిక్త పరిస్థితులకు నిలయంగా ఉండేది. 2003కు ముందు 776 కిలోమీటర్ల మేర విస్తరించిన నియంత్రణ రేఖ ఇరువైపులా తరచూ కాల్పుల ఘటనలు చోటు చేసుకునేవి.
2003లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక... ఆ ఘటనలు తగ్గినా, 2013నుంచి ఆ ఒప్పందం అనేకసార్లు ఉల్లంఘనకు గురవుతూనే ఉంది. భారత్-పాక్ సరిహద్దులోని గ్రామాల ప్రజలు... శరణార్థులుగా శిబిరాల్లో తలదాచుకునేవారు. ఇప్పటి దాకా ఉరీలో జరిగిన సైనిక దాడుల కారణంగా సుమారు 7 వేల మందికి పైగా ప్రజలు అనేక కష్టనష్టాలు చవిచూశారని స్థానికులు వాపోతున్నారు.
స్థానికులకు ధైర్యం..
హింస్మాతక ఘటనలకు ప్రతిరూపమైన ఈ ప్రాంతం...కాల్పుల విరమణతో ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆహ్లాద వాతావరణంతో మానసిక ధైర్యాన్ని అందిస్తోంది. తరుచు కాల్పుల విరమణ ఉల్లంఘనతో తాము భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపే వారమని గతం తలుచుకుని స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. కాల్పులు జరిగిన సందర్భాల్లో తాము బంకర్లలో తలదాచుకునేవారమని నాటి పరిస్థితుల్ని తలుచుకుంటున్నారు. అనేక మంది ఈ కాల్పుల్లో కాళ్లు, చేతులు కోల్పోయి.. దివ్యాంగులుగా మారానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం కఠినంగా అమలు చేస్తున్న తరణంలో... తమ పిల్లలు ప్రశాంతంగా పాఠశాలకు వెళ్తున్నారని స్థానికులు తెలిపారు. నియంత్రణ రేఖ పరిధిలో సైనికులు ఎప్పటికప్పుడూ పహారా కాస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతున్నాయని అన్నారు. కాల్పుల కారణంగా వందలాది మంది జీవితాల్లో విషాదం నెలకొన్న నేపథ్యంలో... నిత్యం నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి తుపాకీ శబ్దాలు వినిపించకూడదని ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న ఘర్షణ వాతావరణాన్ని తగ్గించి శాంతియుత పరిస్థితుల్ని కల్పించాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ ఒప్పందంతో 2021 ఫిబ్రవరి 24 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
ఇదీ చూడండి : ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన- రైతులపై లాఠీఛార్జ్